సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్‌: వినాయకచవితి పర్వదినం సందర్భంగా సింగపూర్‌లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సంస్థవారు అంతర్జాలం ద్వారా చక్కటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా, మహా సహస్రావధాని ప్రముఖ గ్రంథకర్త, బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారు పాల్గొని తమ ఆశీస్సులను అభినందనలను అందించారు. వినాయక చవితి విశిష్టతను వర్ణించి వినాయకుని ఆకార విశేషాన్ని అవతార విశేషాల వెనుక ఉన్న పరమార్థాన్ని విశదీకరించారు. చిత్తశుద్ధిలేని ఆర్భాటాలు, ఆడంబరాలు భక్తి అనిపించుకోవని , భగవంతునిపై ప్రేమతో చేసే పూజలే సంతృప్తిదాయకం, సత్ఫలితదాయకం అని తెలియజేశారు. వ్రత కథ మహత్మ్యం, దాని వెనుక ఆంతర్యం గురించి సోదాహరణంగా చక్కటి ఛలోక్తులతో ఆసక్తికరంగా వివరించారు.

నేటి కరోనా పరిస్థితుల నుండి మానవజాతి నేర్చుకోవాల్సిన పాఠాలను గురించి కూడా అన్వయించి ఆద్యంతం అలరించేలా ప్రవచించారు. దేశవిదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి ఆనందించారు. సింగపూర్‌లోని తెలుగు మహిళలు విద్యాధరి, సౌభాగ్య లక్ష్మి, పద్మావతి వినాయకుని కీర్తిస్తూ భక్తి సంకీర్తనలు ఆలపించారు. ‘సింగపూర్‌లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు కళలకు అద్దం పట్టే విధంగా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించడమే మా సంస్థ ఆశయము. అందుకే నేటి పరిస్థితులు, పరిమితులను దృష్టిలో పెట్టుకొని అంతర్జాలం ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ వినాయకచవితి పండుగనాడు గరికపాటివారి ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశాము’ అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు.

దాదాపు రెండు గంటలపాటు  సాగిన ఈ కార్యక్రమానికి శ్రీధర్ భరద్వాజ్,సుధాకర్ జొన్నాదుల, రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు, పాతూరి రాంబాబు ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించగా ఊలపల్లి భాస్కర్, గణేశ్న రాధా కృష్ణ,  కిరణ్ కుమార్ తూము సాంకేతిక నిర్వహణ పర్యవేక్షించారు.


మరిన్ని