కొవిడ్‌తో 40మంది ఇండియన్‌-అమెరికన్ల మృతి
కొవిడ్‌తో 40మంది ఇండియన్‌-అమెరికన్ల మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో భారత నేపథ్యం ఉన్న దాదాపు 40 మంది కరోనా వైరస్(కొవిడ్‌-19) బారిన పడి మరణించినట్లు అక్కడి భారతీయ సంఘాలు వెల్లడించాయి. వీరిలో కొంతమంది భారత పౌరసత్వం ఉన్నవారు కాగా.. మరికొంత మంది అక్కడే నివాసం ఏర్పరచుకున్న భారత సంతతివారని తెలిపాయి. మరో 1500 మంది వైరస్‌ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌, న్యూజెర్సీ ప్రాంతాల్లోనే అత్యధిక మంది భారతీయులు నివసిస్తుండడం గమనార్హం. 

మరణించిన వారిలో 17 మంది కేరళ, 10 మంది గుజరాత్‌, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌, ఒకరు ఒడిశాకు చెందినవారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో చాలా మంది 60 ఏళ్ల వయసు పైబడినవారేనని సమాచారం. ఒక్కరు మాత్రం 21 ఏళ్ల వయసుగల వారని తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ సేకరించిన వివరాల ప్రకారం దాదాపు 12కు పైగా మంది ఒక్క న్యూజెర్సీలో మరణించారు. మరో 15 మంది న్యూయార్క్‌లో మృత్యువాతపడ్డారు. పెన్సిల్వేనియా, ఫ్లోరిడాలో నలుగురు చొప్పున, టెక్సాస్‌, కాలిఫోర్నియాలో ఒకరు చొప్పున మరణించినట్లు అక్కడి వర్గాలు పీటీఐకి తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు మరణించిన వారిలో 12 మంది భారత పౌరులు ఉన్నట్లు వారి నివేదికలు చెబుతున్నాయి. 

ఇక న్యూజెర్సీలో ఉంటున్న 400 మంది, న్యూయార్క్‌లో ఉంటున్న 1000 మంది ఇండియన్‌ అమెరికన్లు వైరస్‌ బారినపడ్డట్లు సమాచారం. వీరిలో చాలా మంది భారతీయ సంఘాల నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో సున్నోవా అనలైటికల్‌ సీఈఓ హన్మంతరావు మారేపల్లి, న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారవేత్త చంద్రకాంత్‌ అమిన్(75)‌, మహేంద్ర పటేల్‌(60) ఉన్నారు. మరికొంత మంది ఐసీయూల్లో విషమ పరిస్థితుల్లో ఉండడంతో వారి కోసం ప్లాస్మా సేకరించే పనిలో పడ్డాయి అక్కడి భారతీయ సంఘాలు.

ఇవీ చదవండి..

101 రోజులు.. 1,02,136 మరణాలు

24 గంటల్లో 2 వేల మందికిపైగా మృతి


మరిన్ని