జో బైడెన్‌కే డెమోక్రాట్లు జై
జో బైడెన్‌కే డెమోక్రాట్లు జై

పార్టీ జాతీయ సదస్సులో అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నిక

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ను డెమోక్రాట్లు అధికారికంగా నిర్ణయించారు. రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ జాతీయ సదస్సు (డెమోక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌-డీఎన్‌సీ)  ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపింది. ఆ పార్టీకి చెందిన అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జిమ్మీ కార్టర్‌తో పాటు విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి జాన్‌ కెర్రీ, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కొలిన్‌ పావెల్‌ తదితరులు బైడెన్‌కు మద్దతు తెలిపారు. 77 ఏళ్ల బైడెన్‌ నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తలపడతారు. ట్రంప్‌ను తమ అభ్యర్థిగా  రిపబ్లికన్‌ పార్టీ త్వరలో లాంఛనప్రాయంగా ప్రకటించనుంది.

హిందువుల ఓట్లకు వల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిందువుల ఓట్లను రాబట్టుకొనేందుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు పోటీపడుతున్నారు. 2016 జనగణన ప్రకారం అమెరికాలో హిందువుల జనాభా ఒక శాతంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ మైనార్టీ మత వర్గం వారి ఓట్లకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యం ఏర్పడటం విశేషం. మత స్వేచ్ఛకున్న అవరోధాలను తొలగిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ శిబిరం వాగ్దానం చేస్తుండగా.. భారత దేశ మూలాలున్న కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థినిగా ప్రకటించి హిందువులకు దగ్గరయ్యేందుకు బైడెన్‌ వర్గం యత్నిస్తోంది. ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి వీసాల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని హామీ ఇస్తోంది.

రష్యా నిఘా సిబ్బందితో ట్రంప్‌ ప్రచార బృందం మంతనాలు!
నాలుగేళ్ల క్రితం(2016) జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ ప్రచార బృందం తరచూ రష్యా నిఘా సిబ్బందితో మంతనాలు జరిపిందని సెనేట్‌ కమిటీ ఒకటి నిర్ధారణకు వచ్చింది. రిపబ్లికన్‌ సెనేటర్‌ నేతృత్వంలోని ఈ కమిటీ వెయ్యి పేజీలతో కూడిన అయిదవది, చిట్టచివరిదైన నివేదికను రూపొందించింది. ట్రంప్‌ తరఫున రష్యా ఎంత దూకుడుగా ఆ నాటి ఎన్నికల్లో జోక్యం చేసుకుందీ అందులో వివరించింది. రష్యా నిఘా వర్గాలు హ్యాక్‌ చేసిన డెమోక్రాట్ల ఈమెయిల్స్‌ నుంచి గరిష్ఠ లబ్ధి పొందేందుకు ట్రంప్‌ బృందం ప్రయత్నించిందని పేర్కొంది. మూడేళ్లకు పైగా దర్యాప్తు జరిపి తాజా నివేదికను కమిటీ రూపొందించింది.

Tags :

మరిన్ని