అమెరికా అందరిదీ
అమెరికా అందరిదీ

వివక్షకు తావులేదు 
నేను వెలుగుకు భాగస్వామిని 
డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ 


 

అమెరికా అందరిదీ అన్న ప్రతిజ్ఞను పునరుద్ధరించడమే తదుపరి అధ్యక్షుని విధి అని జో బైడెన్‌ అన్నారు. ఆ కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా ఆయన పేరును డెమొక్రాటిక్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. గురువారం జరిగిన ఆ పార్టీ నాలుగు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ‘అభ్యర్థిత్వ అంగీకార’ ప్రసంగాన్ని చేశారు. అమెరికా అందరిదీ అన్న వాగ్ధానాన్ని తాను ఒంటరిగా అమలు చేయనని అన్నారు. ఉపాధ్యక్షురాలి రూపంలో బలమైన గళం అండగా ఉంటుందంటూ కమలాహారిస్‌ను పరిచయం చేశారు. అమె కథ అందరి అమెరికన్ల చరిత్ర అని చెప్పారు.

మనం సిద్ధమా?
ప్రస్తుత దేశ పరిస్థితులను వివరిస్తూ ‘‘వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. ఆర్థిక రంగం సంక్షోభంలో ఉంది. జాత్యహంకార దాడులను, వివక్షను ఎదుర్కొంటున్నాం. పర్యావరణ సమస్యలు శ్రుతి మించాయి. నేను అధికారంలోకి వస్తే మొదటి రోజున చేసే పని కరోనాను నివారించడం’’ అన్నారు. అమెరికాలోని  కఠోర వాస్తవాలు చూసిన తరువాత మార్పులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘మార్పులకు మనం సిద్ధమా? తయారుగా ఉన్నామని నమ్ముతున్నా’ (ఆర్‌ వి రెడీ? ఐ బిలీవ్‌ వి ఆర్‌) అని నినదించారు. ‘‘అధ్యక్షునిగా నేను అమెరికాను రక్షిస్తా. కనిపించిన, కనిపించని దాడుల నుంచి అన్ని వేళలా... కాపాడతానని,  వెలుగుకు భాగస్వామిగా ఉంటానని వాగ్ధానం చేస్తున్నా’’ అని ప్రకటించారు. 

బాంబే బైడెన్‌ ప్రస్తావన
బైడెన్‌ తన ప్రసంగంలో ముంబయి (బాంబే) బైడెన్‌ గురించి ప్రస్తావించారు. ఆయన 29 ఏళ్ల వయసులో తొలిసారిగా సెనేట్‌కు ఎన్నికయినప్పుడు ‘బాంబే నుంచి బైడెన్‌’ పేరుతో ఓ లేఖ వచ్చింది. అయితే ఆయన ఎవరో ఇంతవరకు తెలుసుకోలేకపోయారు. ఆయన ఆచూకీ తెలిస్తే చెప్పాలని తాజాగా  కోరడం గమనార్హం. గతంలో అమెరికా సర్జన్‌ జనరల్‌గా పనిచేసిన ఇండియన్‌-అమెరికన్‌ వివేక్‌ మార్తి (43) మాట్లాడుతూ అమెరికాకు అన్నీ ఉన్నా నాయకత్వం లేదని, అందువల్లనే కరోనా అదుపులోకి రాలేదని చెప్పారు. బైడెన్‌ వస్తే నాయకత్వ పటిమతో దేశానికి సాంత్వన చేకూరుస్తారని  అన్నారు.

కోర్టు తీర్పుతోనే కుమార్తెలకు దూరం 
కమలా హారిస్‌ తండ్రి 

న్యూయార్క్‌: కోర్టు తీర్పు కారణంగానే కుమార్తెలతో సన్నిహితంగా మెలగలేకపోయినట్టు కమలాహారిస్‌ తండ్రి డేవిడ్‌ హారిస్‌ (81) చెప్పారు. అధ్యాపక వృత్తిలో ఉంటూ పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. అమెరికా మీడియా కథనం ప్రకారం...కమలకు అయిదేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి డేవిడ్, తల్లి శ్యామలా గోపాలన్‌లు విడాకులు తీసుకున్నారు. పిల్లలు ఎవరి వద్ద ఉండాలనేదానిపై కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌ కోర్టులో కేసు నడిచింది. తండ్రులయితే పిల్లలను సక్రమంగా పెంచలేరని భావించిన న్యాయస్థానం కమల, ఆమె చెల్లెలు మాయ తల్లి సంరక్షణలో పెరగాలని నిర్ణయిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో 1972 నుంచి పిల్లలతో తన సంబంధాలు తెగిపోయాయని ఆయన చెప్పారు. వారిపట్ల తన ప్రేమను, బాధ్యతలను ఎప్పుడూ వదులుకోలేదని అన్నారు.  

Tags :

మరిన్ని