పీవీ స్థితప్రజ్ఞుడు
పీవీ స్థితప్రజ్ఞుడు

తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు
శతజయంత్యుత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటోలో వేడుకలు

ఈనాడు, హైదరాబాద్‌: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు స్థితప్రజ్ఞుడు, సంపూర్ణ వ్యక్తిత్వం గల మహామనిషి అని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. పీవీ శతజయంత్యుత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కెనడాలోని టొరంటో నగరంలో వేడుకలను నిర్వహించారు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేకే మాట్లాడుతూ.. పీవీ తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణంగా ఉందన్నారు. ‘దేశ ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. రాజకీయ కారణాల వల్ల ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదు. ఆ లోటును తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీల సాయంతో పీవీకి భారతరత్న పురస్కారం దక్కేలా సీఎం కృషి చేస్తున్నారని వివరించారు. పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారన్నారు. తెరాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఆన్‌లైన్‌ పిటిషన్‌ ప్రారంభించగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని తెలిపారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని