కరోనా కథ మార్చేనా..!
కరోనా కథ మార్చేనా..!

ట్రంప్‌నకు వైరస్‌ సోకడంపై సర్వత్రా చర్చ
ఎన్నికలపైనా ప్రభావం!

రో నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రచారం మంచి రసపట్టులో ఉంది. ఈ దశలో అధ్యక్షుడు ట్రంప్‌ కొవిడ్‌ బారిన పడటంతో ఎన్నికలు.. ఆయన ఆరోగ్య పరిస్థితి.. అనంతర పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వృద్ధాప్యంలో కరోనా సోకడం ప్రమాదకరమేనని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదంతాలు చెబుతున్నాయి. 74 ఏళ్ల ట్రంప్‌ ఇంట్లోనే ఉంటూ పూర్తిగా కోలుకుంటే సరే.. అలా కాకుండా ఆసుపత్రిలో చేరి పెద్ద చికిత్స తీసుకోవాల్సి వస్తే పాలన బాధ్యతలు ఎవరు చూస్తారు? ఎన్నికలు ఏ దిశగా వెళ్తాయి?
అధ్యక్షుడు ఆసుపత్రి పాలైతే..
అమెరికాలో రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు పాలించే పరిస్థితిలో లేనప్పుడు ఉపాధ్యక్షుడు తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు. ఇప్పుడు ట్రంప్‌నకు అత్యవసర చికిత్స అవసరమైతే ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ బాధ్యతలు స్వీకరించొచ్చు. 1963లో అధ్యక్షుడు జాన్‌ కెనెడీ హత్యకు గురైన తర్వాత 1967లో రాజ్యాంగానికి 25వ సవరణ చేశారు. దీని ప్రకారం అధ్యక్షుడు విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉంటే తనే స్వయంగా అధికారాలను తాత్కాలికంగా బదలాయిస్తారు. అయితే బాధ్యతలు బదలాయించే స్థితిలో కూడా లేనట్లయితే.. ఉపాధ్యక్షుడు లేదా కేబినెట్‌ కాంగ్రెస్‌ ఉభయసభల నేతలకు తెలియజేసి తాత్కాలిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనూ ఉపాధ్యక్షుడు తాత్కాలిక బాధ్యతలు చేపడతారు.
* 1985 జులై 13న అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమయింది. ఆ రోజు ఉదయం 11.28 నుంచి 8 గంటల పాటు ఉపాధ్యక్షుడైన జార్జి హెచ్‌.డబ్ల్యూ బుష్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు.
* 2002 జూన్‌ 29న అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ కొలనోస్కోపీ చేయించుకున్నారు. దీంతో ఆయన ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీకి తాత్కాలికంగా అధికారాలు బదలాయించారు. ఆయన ఉదయం 7.09 నుంచి ఉదయం 9.24 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2007, జులై 21న బుష్‌ కొలనోస్కోపీ చేయించుకుని మళ్లీ డిక్‌ చెనీకి ఉదయం 7.16 నుంచి 9.21 వరకు తాత్కాలికంగా అధికారాలు బదలాయించారు.
* ఒక వేళ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు రెండూ ఖాళీ అయితే ప్రతినిధుల సభ స్పీకర్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రతినిధుల సభ స్పీకర్‌ కూడా లేని పక్షంలో సెనేట్‌ నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి అధ్యక్షుడవుతారు.
ఎన్నికల మాటేమిటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాస్త్రాల్లో కరోనా ముఖ్యమైన అంశం. తాను కాబట్టి కరోనాను నియంత్రించగలిగానని, డెమోక్రాట్లు అధికారంలో ఉండి ఉంటే మరణాలు ఇంకా ఎక్కువగా ఉండేవని ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు. తాను అసలు మాస్కే వేసుకోనని గొప్పగా చెప్పారు. కరోనాకు భయపడాల్సిన పనిలేదని ఇటీవల అన్నారు. ఈనేపథ్యంలో ట్రంప్‌నకు కరోనా సోకడంతో ఈ నెల 15న ప్రత్యర్థి బైడెన్‌తో జరగాల్సిన చర్చా కార్యక్రమం అనిశ్చితిలో పడింది. అయితే వైరస్‌ సోకడాన్ని కూడా ట్రంప్‌ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరగా కోలుకుంటే ‘చూశారా? దీనికి భయపడాల్సిన పనిలేదని చెప్పానా?’ అంటూ ప్రచారం చేయవచ్చని, ఒక వేళ తీవ్ర అనారోగ్యం బారిన పడి కోలుకుంటే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లా సానుభూతిని సాధించే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

మరిన్ని