గాన గంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి
గాన గంధర్వుడికి భారతరత్న ఇవ్వాలి

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషా సంస్థలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాలుకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. 16 భాషల్లో 40 వేల పాటలు పాడడం అంటే సాధారణ విషయం కాదన్నారు. నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్‌ కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీబీ.. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువ గాయనీ గాయకులను తీర్చిదిద్దారని అన్నారు. జూమ్‌ వేదికగా వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో అమెరికా గాన కోకిల శారద ఆకునూరి నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. భారత్‌, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో స్థిరపడిన వారు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఎస్పీబీకి నివాళులర్పించారు. 

రానున్న రోజుల్లో అంతర్జాలం వేదికగా 74 రోజుల పాటు ఎస్పీ బాలు సంగీతోత్సవాలు నిర్వహిస్తామని వంశీ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శిరోమణి డాక్టర్‌ వంశీ రామరాజు ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ప్రత్యేకంగా ఓ వీడియో సందేశం పంపారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు డాక్టర్‌ నగేశ్‌ చెన్నుపాటి, తానా ప్రెసిడెంట్‌ జయశేఖర్‌ తాళ్లూరి, నాట్స్‌ అధ్యక్షుడు శేఖర్‌ అన్నే, కళా భారతి డాక్టర్‌ జమునా రమణారావు, సినీ దర్శకుడు కోదండ రామిరెడ్డి, రేలంగి నర్సింహారావు, నేపథ్య గాయని జమునా రాణి, సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్‌, వీణాపాణి, కేఎం రాధాకృష్ణన్‌, సినీ గేయ రచయితలు భువనచంద్ర, వెన్నెలకంటితో పాటు వడ్డేపల్లి కృష్ణ, టాటా అధ్యక్షుడు భరత్‌ మందాడి, ఎస్‌ నరేంద్ర, ఆళ్ల శ్రీనివాస్‌, మ్యూజిక్‌ వరల్డ్‌ రాజేశ్‌ శ్రీ తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.

Tags :

మరిన్ని