విదేశీ నిపుణులకు మరో ఝలక్‌!
విదేశీ నిపుణులకు మరో ఝలక్‌!

బి-1 వీసాల జారీని నిలిపివేయాలని ట్రంప్‌ సర్కారు ప్రతిపాదన

వాషింగ్టన్‌: విదేశీ ఉద్యోగ నిపుణులకు అందించే వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక చర్యకు రంగం సిద్ధం చేసింది! హెచ్‌-1బి ప్రత్యేక నైపుణ్యాల జాబితాలోని ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులకు తాత్కాలిక వ్యాపార వీసాలు అందించే ప్రక్రియను నిలిపివేయాలని తాజాగా ప్రతిపాదించింది. ఇది అమల్లోకి వస్తే వందల మంది భారతీయులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. విదేశీ నిపుణులు అమెరికాలో కొన్నాళ్లపాటు పనిచేసేందుకు ‘బి-1’ వీసా వీలు కల్పిస్తుంది. ‘హెచ్‌-1బి’కి ప్రత్యామ్నాయంగా దీన్ని కంపెనీలు భావిస్తుంటాయి. ‘హెచ్‌-1బి’తో పోలిస్తే ‘బి-1’ రుసుము కూడా తక్కువ. దీంతో తమ ఉద్యోగులను ఆన్‌సైట్‌ విధుల కోసం తాత్కాలికంగా అమెరికాకు పంపించేందుకు కంపెనీలు ఈ వీసాను ఉపయోగించుకుంటుంటాయి. అయితే- కొన్ని సంస్థలు అమెరికా పౌరులను ఉద్యోగాల నుంచి తొలగించి మరీ బి-1 వీసాల మీద విదేశీ నిపుణులను రప్పించుకుంటున్నాయని.. ఫలితంగా స్థానికులు ఉపాధి కోల్పోతున్నారని తాము గుర్తించినట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే అలాంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘బి-1’ వీసాపై ఏటా 6,000-8,000 మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లు అంచనా.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని