అమెరికా.. ఊపిరి పీల్చుకో
అమెరికా.. ఊపిరి పీల్చుకో

 

నేడు ఫైజర్‌ టీకా పంపిణీ ప్రారంభం
మిషిగన్‌ నుంచి బయల్దేరిన ట్రక్కులు

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న అమెరికా ఊపిరి పీల్చుకోనుంది. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌కు ఆ దేశం సిద్ధమైంది. సోమవారమే ఫైజర్‌ టీకా తొలి డోసులను అమెరికా ప్రజలు తీసుకోనున్నారు. అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఫైజర్‌ టీకా రవాణా ఆదివారం ప్రారంభమైంది. మిషిగన్‌లోని ఫైజర్‌ అతి పెద్ద కర్మాగారం నుంచి ఫెడెక్స్‌ ట్రక్కులు బయల్దేరాయి. ఇవి 145 టీకా సరఫరా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను సురక్షితంగా అందజేయనున్నాయి. టీకాను మైనస్‌ 94 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే భద్రపరచాలి. ఇందుకు తగ్గట్లు ఫైజర్‌ ఏర్పాట్లు చేసింది. టీకా బాక్సుల్లో జీపీఎస్‌ పరికరాలను కూడా అమర్చింది. వీటితో ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తారు. తొలి విడతలో అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్స్‌లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్‌హోమ్‌ల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇవ్వనున్నారు. తర్వాత మళ్లీ మూడు వారాలకు వీరందరికీ రెండో డోసు సరఫరా చేస్తారు.


టీకా పరీక్షల్లో రాజీలేదు : ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌

దిల్లీ: కొవిడ్‌-19 టీకాల భద్రత, సమర్థతపై వచ్చిన ఆందోళనలను ప్రముఖ క్లినికల్‌ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ కొట్టిపారేశారు. ఈ వ్యాక్సిన్లను చాలా స్వల్ప సమయంలోనే అభివృద్ధి చేసినప్పటికీ వాటిని పరీక్షించే సమయంలో మాత్రం ఎలాంటి రాజీ లేదని చెప్పారు. కొవిడ్‌-19ను నిరోధించే టీకాల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న ‘కోయిలేషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌’ సంస్థలో కాంగ్‌ సభ్యురాలు. వైరస్‌ వ్యాప్తి, అంటువ్యాధుల నివారణ వంటి అంశాల్లో ఆమె పరిశోధనలు సాగిస్తున్నారు. లండన్‌లోని రాయల్‌ సొసైటీలో సభ్యత్వం సాధించిన తొలి భారత మహిళగా కూడా గుర్తింపు పొందారు. తాజాగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ల పంపిణీలో సమతూకం పాటించాలని సూచించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా అందరికీ అవి లభించేలా చూడాలన్నారు. ఈ దఫా క్లినికల్‌ పరీక్షలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ, వేగంగా ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే నిర్వహించాలి

కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టొద్దు


Tags :

మరిన్ని