ప్రస్తుతానికి లాటరీ విధానమే
ప్రస్తుతానికి లాటరీ విధానమే

హెచ్‌-1బి వీసాల జారీపై బైడెన్‌ సర్కారు నిర్ణయం
ట్రంప్‌ తెచ్చిన నూతన విధానం అమలు
డిసెంబరు 31 వరకు వాయిదా

వాషింగ్టన్‌: హెచ్‌-1బి వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి అమెరికాలో బైడెన్‌ సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, ప్రతిభ ఆధారంగా వాటిని జారీ చేసేందుకు వీలుగా ట్రంప్‌ హయాంలో తీసుకొచ్చిన నూతన విధానం అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పాత లాటరీ విధానంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ‘హెచ్‌-1బి’ అనేది వలసేతర వీసా. అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) ఏటా ఈ వీసాలను గరిష్ఠంగా 65 వేల వరకు జారీ చేస్తుంటుంది. ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం (స్టెమ్‌) విభాగాల్లో ఉన్నత విద్య పూర్తిచేసిన వారికి అదనంగా మరో 20 వేల వరకూ వీసాలను జారీ చేసే అధికారమూ దానికి ఉంది. అయితే- కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలివ్వకుండా, తక్కువ వేతనాలకే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకుంటూ ‘హెచ్‌-1బి’ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో వేతనాలు అధిక నైపుణ్యాలు, అత్యధిక వేతనాలు ఉన్న విదేశీయులకే ఆ వీసాలను జారీ చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. సంప్రదాయ కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ ఈ ఏడాది జనవరి 7న యూఎస్‌సీఐఎస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది కూడా. మార్చి 9 నుంచి నూతన విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే- కొత్త విధానానికి సంబంధించిన నిబంధనల రూపకల్పనకు, వాటిని పరీక్షించేందుకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు మరికొంత సమయం అవసరమని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ నేతృత్వంలోని సర్కారు అభిప్రాయపడింది. దీంతో ఈ ఏడాది చివరి వరకూ పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది.

Tags :

మరిన్ని