టెక్సాస్‌లో భారీ మంచు తుపాను
టెక్సాస్‌లో భారీ మంచు తుపాను

 విద్యుత్తు కోతలతో జనం సతమతం
వందకు పైగా రహదారి ప్రమాదాలు

డల్లాస్‌: అమెరికాలో శీతాకాలంలో పడిపోయిన ఉష్ణోగ్రతలకు తోడు భారీగా కురుస్తున్న మంచు తుపాను వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్‌ రాష్ట్రంలో మైనస్‌ 5 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడి రహదారులపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. హూస్టన్‌ నగరం పరిసరాల్లో సుమారు 120 రహదారి ప్రమాదాలు జరిగాయని, ఒకచోట 10 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. దీనికితోడు అతి శీతల పరిస్థితుల వల్ల విద్యుత్తు వినియోగం భారీ ఎత్తున పెరగడంతో కరెంటు కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్తు నిర్వహణ సంస్థ ఎలెక్ట్రిక్‌ రిలయబిలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్సాస్‌(ఈఆర్‌సీవోటీ) కరెంటు కోతలు అధికం చేయడంతో వేల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజులు విద్యుత్తు కోతలకు సిద్ధంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇదిలా ఉండగా మంగళవారానికి దక్షిణ ప్రాంతాల్లో 30 సెంటిమీటర్ల మేరకు మంచు కురవొచ్చని వాతావారణ శాఖ అంచనా వేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదివారం రాత్రి టెక్సాస్‌లో ఎమర్జన్సీ ప్రకటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థలు సహకారం అందించాలని ఆదేశించారు. మరోవైపు మంచు తుపాను వల్ల విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Tags :

మరిన్ని