కమలా హారిస్‌కు ఇంటి తిప్పలు
కమలా హారిస్‌కు ఇంటి తిప్పలు

పదవి చేపట్టి రెండు నెలలైనా అధికార నివాసానికి ఇంకా దూరం

వాషింగ్టన్‌: అమెరికాలో అంతా సవ్యంగా ఉంటుందని.. ఏ పనీ సాగదీయరని.. ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతాయని అనుకుంటాం. కానీ అగ్రరాజ్యంలోనూ అలసత్వం పరాకాష్ఠకు చేరుకుంటున్న దాఖలాలు కనబడుతున్నాయి. ఇది సాక్షాత్తూ అమెరికా ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్‌ విషయంలోనే జరగడం విశేషం. కమల.. ఉపాధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టి రెండు నెలలైంది. కానీ ఇంకా ఆమె అధికార నివాసంలో అడుగు పెట్టలేదు. ఎప్పుడు అడుగుపెడతారో తెలియని పరిస్థితి! కారణం.. ఆ నివాసానికి మరమ్మతులు జరుగుతుండడమే. మరి అవి ఎప్పుడు ముగుస్తాయంటే సమాధానం లేదు. దీంతో ఎప్పుడెప్పుడు తన అధికార నివాసంలోకి చేరుదామా అని ఆలోచిస్తున్న కమలా హ్యారిస్‌కు ఈ సంఘటన విసుగు తెప్పిస్తోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో.. అధ్యక్ష, ఉపాధ్యక్ష నివాసాలు ఉంటాయి. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు జనవరి 20న ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజున.. అధ్యక్షుడికి కేటాయించే అధికార నివాసమైన శ్వేతసౌధానికి బైడెన్‌ వెళ్లిపోయారు. కమల మాత్రం.. తన భర్త డగ్లస్‌ ఎమ్హోఫ్‌తో కలిసి.. రెండు నెలలుగా అధ్యక్షుడి అధికార అతిథి గృహమైన బ్లెయిర్‌ హౌస్‌లోనే ఉంటున్నారు. సూట్‌కేసుల్లో సర్దుకున్న వస్తువులనే వినియోగిస్తున్నారు ఉపాధ్యక్షుల కోసం కేటాయించిన నివాసం(నావల్‌ అబ్జర్వేటరీ)లో మరమ్మతులు జరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ అవి ఎలాంటి మరమ్మతులు? అవి ఎప్పుడు పూర్తవుతాయి? అసలు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు.అధికార రికార్డులను పరిశీలించిన ఓ అమెరికన్‌ వార్తా సంస్థ.. ఉపాధ్యక్షురాలి అధికార నివాసంలో ప్లంబింగ్, హీటింగ్, ఎయిర్‌ కండీషనింగ్‌కు సంబంధించి మరమ్మతులు జరుగుతున్నట్టు గుర్తించింది. కానీ.. అధికార నివాసంలోకి కమల వెళ్లకపోవడానికి ఇవేవీ సరైన కారణాలు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 వంట గది కోసం! 

మూడు వారాల క్రితం.. పనులు జరుగుతున్న తీరు పర్యవేక్షించేందుకు కమలా హారిస్‌.. తన అధికార నివాసానికి వెళ్లారు. వంటలపై మక్కువ చూపించే కమల.. వంటగదిలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. అయినా కాంట్రాక్టు సంస్థ పట్టించుకోలేదు. ఉపాధ్యక్షురాలి సూచనల మేరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఓవైపు ఈ వ్యవహారంపై కమల విసుగెత్తిపోతున్నారని, అధికార నివాసానికి ఎప్పుడు వెళతానా అన్న ఆలోచన ఆమెలో రోజురోజుకు పెరిగిపోతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Tags :

మరిన్ని