అప్పుడు.. ఇప్పుడు.. దక్కని కడసారి చూపు
అప్పుడు.. ఇప్పుడు.. దక్కని కడసారి చూపు

సౌదీఅరేబియాలో కన్నుమూసిన హైదరాబాద్‌ వాసి

బోరబండ, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారి అయినవారి మధ్య కడసారి చూపునూ దూరంచేస్తోంది. ఇంజినీర్‌గా సౌదీఅరేబియాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తల్లి ఏడాది క్రితం మరణించగా అంత్యక్రియలకు ఆయన స్వదేశానికి రాలేకపోయారు. ఇప్పుడు సౌదీలో ఆ ఇంజినీర్‌ కొవిడ్‌ బారిన పడి మృతి చెందగా.. ఆయన భార్య-పిల్లలు కడసారిచూపునకూ నోచుకోని పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఎం.డి.ఫైజుద్దీన్‌(53) కుటుంబం వ్యథాభరిత గాథ ఇది. వీరి కుటుంబం బంజారాహిల్స్‌లో ఉంటోంది. ఆయన భార్య ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా.. ఫైజుద్దీన్‌ కొన్నేళ్లుగా సౌదీఅరేబియాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తల్లి గతేడాది మే 12న అనారోగ్యంతో మరణించగా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలు నడవక భారత్‌కు రాలేకపోయారు. తనయుడి చేతుల మీదుగా జరగాల్సిన ఆమె అంత్యక్రియలు బంధువులు, చుట్టుపక్కల వారు నిర్వహించారు. దీన్ని ఆయన వీడియోకాల్‌లో చూసి కన్నీరుమున్నీరయ్యారు. తాజాగా పెద్ద కుమార్తెకు వివాహం చేయాలన్న తలంపుతో ఉన్న ఫైజుద్దీన్‌ మార్చి చివరి వారంలో నగరానికి రావాల్సి ఉంది. అంతలో అక్కడ కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఆయన భార్య, పిల్లలు వెళ్లే అవకాశం లేక విలవిల్లాడుతున్నారు. వచ్చే శుక్రవారం సౌదీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అక్కడే ఉంటున్న వారి బంధువుకు అధికారం కల్పిస్తూ ఫైజుద్దీన్‌ భార్య, ఇద్దరు చెల్లెళ్లు పత్రాలపై సంతకాలు చేసి పంపించారు.

Tags :

మరిన్ని