Fauci: వుహాన్‌ వ్యూహంలో ఫౌచీ?
Fauci: వుహాన్‌ వ్యూహంలో ఫౌచీ?

అమెరికా అంటువ్యాధుల నిపుణుడిపై రిపబ్లికన్ల విమర్శల దాడి
కరోనా పుట్టుకపై ప్రజల్ని తప్పుదారి పట్టించారని ఆరోపణ
 పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చనే వాదనలు బలపడే కొద్దీ అమెరికాకు చెందిన అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై స్వదేశంలో విమర్శలు పెరిగిపోతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్లు అయితే ఆయనను ఓ అబద్ధాలకోరుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఫౌచీ ఈ మెయిల్స్‌ బహిర్గతమైన నేపథ్యంలో ఆరోపణలను తీవ్రతరం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ సలహాదారు పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా పుట్టుక విషయంలో చైనాను సమర్థించేలా గతంలో ప్రకటనలు చేసి అమెరికన్లను తప్పుదారి పట్టించారని, ఆయనపై చట్టసభల సభ్యుల కమిటీతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలనీ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ జోష్‌ హావ్‌లే కోరారు. వుహాన్‌ ల్యాబ్‌లో ఏమి జరిగిందో నిజంగా ఆయనకు తెలియదా? లేదా అన్నీ తెలిసే.. అబద్ధాలు చెప్పారా? అన్న అనుమానాలను వారు వ్యక్తంచేస్తున్నారు. 
వాటిలో ఏముంది?
ఇటీవల సమాచార స్వేచ్ఛ కింద ఫౌచీ ఈ మెయిల్స్‌ కొన్ని బహిర్గతం అయ్యాయి. తొలి నాళ్లలో ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించిన ఫౌచీ.. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం’ అని అన్నారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో డాక్టర్‌ ఫౌచీకి.. ఇమ్యూనాలజిస్టు క్రిస్టియన్‌ అండర్సన్‌ ఒక ఈమెయిల్‌ పంపించారు. దానిలో ‘వైరస్‌కు ఉన్న అసాధారణ లక్షణాలు చూస్తుంటే దీనిని ల్యాబ్‌ సెట్టింగ్స్‌లో మార్చారేమో అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. కానీ తర్వాత ఆయనే ల్యాబ్‌ లీక్‌ సిద్ధాంతానికి ఆధారాల్లేవు అని పత్రాన్ని సమర్పించారు. మరోపక్క డాక్టర్‌ ఫౌచీ ఈ వైరస్‌ సహజంగానే జంతువుల నుంచి మనుషుల్లోకి వ్యాపించిందనే వాదనలను అప్పట్లో బలపరిచారు. వాస్తవానికి ఏ జంతువు నుంచి కరోనా వైరస్‌ వచ్చిందో ఇప్పటికీ తెలియదు. తాజాగా ఫౌచీ కూడా ల్యాబ్‌ లీక్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హామీ ఇవ్వలేనని...

ఫిబ్రవరి 2020లో డాక్టర్‌ ఫౌచీ తన సహాయకుడు హ్యూజ్‌ ఔచిన్‌క్లోస్‌కు ఒక మెయిల్‌ పంపారు. దీనిలో కరోనా వైరస్‌లపై చేసిన గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్స్‌ పరిశోధన పత్రం ఉంది. దీనిని చదవాలని హ్యూజ్‌ను ఫౌచీ ఆదేశించారు. దీనికి అతను స్పందిస్తూ.. ‘విదేశాల్లో జరిగిన ఈ పరిశోధనకు మనకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో తెలుసుకుంటాను’ అని పేర్కొన్నారు. ఎన్‌ఐహెచ్‌ నిధులను కరోనా వైరస్‌లపై పరిశోధనలకు వెచ్చించడంపై ‘న్యూస్‌ నేషన్‌ నౌ’ కార్యక్రమంలో ఫౌచీ స్పందించారు. తాము నమూనాల సేకరణకు మాత్రమే ఎకో హెల్త్‌ ఫౌండేషన్‌కు నిధులు సమకూర్చామని వెల్లడించారు. కానీ, వుహాన్‌ ల్యాబ్‌లో అన్నీ మేము అనుకున్నట్లే జరుగుతాయని హామీ ఇవ్వలేనని తెలిపారు. తన ఈమెయిల్స్‌ను తప్పుగా అన్వయించుకొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌...‘నేను అప్పుడే చెప్పాను. కరోనా వైరస్‌ వెనుక చైనా కుట్ర ఉందని. ఆ మాటే నిజమైంది’ అని వ్యాఖ్యానించారు. డాక్టర్‌ ఫౌచీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.అంటువ్యాధుల నిపుణుడిగా ఫౌచీ అనేక మంది శాస్త్రవేత్తలతో మాట్లాడుతుంటారని, అంతమాత్రాన ఆయనను వుహాన్‌ ల్యాబ్‌ కుట్రలో భాగస్వామిని చేయడం తగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా కట్టడి విషయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడుట్రంప్‌ అంటువ్యాధుల నిపుణుడైన ఫౌచీతో తరచూ విభేదించి అభాసుపాలయ్యారు. ట్రంప్‌ మాదిరిగా ఆయన చైనాపై నిరాధారమైన విమర్శలను చేయలేదు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బైడెన్‌ వైరస్‌ వ్యాప్తికి విజయవంతంగా అడ్డుకట్టవేయగలిగారు. ఫౌచీ సూచనలు, సలహాలతోనే ఇది సాధ్యమయ్యింది. ప్రజల్లో బైడెన్, ఫౌచీల పలుకుబడి ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈమెయిల్స్‌ను అవకాశంగా మలచుకొని రిపబ్లికన్‌ నేతలు ఫౌచీపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ డాక్టర్‌ ఫౌచీకి మద్దతుగానే నిలుస్తామని శ్వేత సౌధం స్పష్టం చేసింది. దేశానికి ఆయన ఓ తరగని ఆస్తి లాంటివారని ప్రశంసించింది. బైడెన్‌ కూడా ఫౌచీపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.

చైనా ల్యాబ్‌కు నిధులు

2014-19 వరకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ హెల్త్‌ నుంచి ఎకోహెల్త్‌ అలయన్స్‌కు.. అక్కడి నుంచి వుహాన్‌ ల్యాబ్‌కు 3.4 మిలియన్‌ డాలర్లు వెళ్లాయి. ఆ సంస్థకు వుహాన్‌ ల్యాబ్‌తో సంబంధాలు ఉన్నాయి. దీని యజమాని పేరు పీటర్‌ డెస్జోక్‌. అతను 2020 ఏప్రిల్‌ 20వ తేదీ ఫౌచీకి ఒక మెయిల్‌ పంపించారు. దీనిలో ‘మా మిత్రులు, భాగస్వాముల తరపున మీరు నిలబడినందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెబుతున్నాను. వైరస్‌ పుట్టుక సహజమైనదే అన్న వాదనకు మీ మద్దతుతో శాస్త్రపరంగా బలం చేకూరింది. విశ్వసనీయమైన మీ మాటలు వైరస్‌ పుట్టుకపై అనుమానాలను దూరం చేస్తాయి’ అని పేర్కొన్నారు. 

Advertisement


మరిన్ని