విద్యార్థులకు ద్వారాలు తెరచిన బ్రిటన్‌!
విద్యార్థులకు ద్వారాలు తెరచిన బ్రిటన్‌!

ఈ-వీసాల విధానం ఆరంభం
రెండేళ్లు పనిచేసేందుకూ వెసులుబాటు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల కోసం బ్రిటన్‌ ద్వారాలు తెరచింది. చదువుకునేందుకు తమ దేశానికి వచ్చే విద్యార్థుల్లో అర్హులు రెండేళ్లపాటు పనిచేసేందుకు సైతం వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మేరకు ఈ-వీసా విధానాన్ని బ్రిటన్‌ హోం సెక్రటరీ ప్రీతిపటేల్‌ ఆవిష్కరించినట్లు హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘దరఖాస్తులను తొలిసారి డిజిటల్‌ రూపంలో ఆహ్వానిస్తున్నాం. చరవాణి ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులకు ఈ-వీసాలను జారీ చేస్తాం. చరవాణిలోనే ఈ-వీసా ఉండటంతో ఎలాంటి సందర్భాల్లోనే తమ హోదాను నిరూపించుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది’ అంటూ ప్రస్తావించింది. ‘ఈసారి బ్రిటన్‌లో చదువుకునేందుకు విద్యార్థులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేస్తారని అంచనా వేస్తున్నాం. గత ఏడాది 56వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలిచ్చాం. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అది 13 శాతం అదనం. భారత్‌తో పాటు అంతర్జాతీయ విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకునేందుకు పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని ప్రారంభించాం’ అని ప్రీతి పటేల్‌ పేర్కొన్నారు. బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులకు గమ్యస్థానాలుగా ఉన్నాయని ఇండియాలోని బ్రిటిష్‌ హైకమిషనర్‌ జాన్‌ థాంప్సన్‌ తెలిపారు. ఇమిగ్రేషన్‌ వ్యవహారాలపై గత మే నెలలో కుదిరిన ఒప్పందం మేరకు నిపుణులైన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల దరఖాస్తులకు సంబంధించిన మరింత సమాచారం కోసం gov.uk ను సంప్రదించవచ్చని, ఇప్పటికే కోర్సుల్లో చేరినవారు, ఈ సంవత్సరం చేరాలనుకునేవారు సెప్టెంబరు 27లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో స్పష్టీకరించారు.

Advertisement

Tags :

మరిన్ని