మా నగరానికి రండి.. ఇక్కడే ఉండిపోండి
మా నగరానికి రండి.. ఇక్కడే ఉండిపోండి

ఇటలీలోని టెవోరా ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

మన దేశంలో జనాభా పెరుగుదలతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే చైనా జనాభాకు సమీపంలోకి వచ్చేశాం.. ఇంకొన్ని దశాబ్దాలు దాటితే చైనాను కూడా దాటేస్తాం. ఇది ఇలాగే కొనసాగితే.. దేశంలో ఆహారం, ఉద్యోగమే కాదు.. ఉండటానికి నిలువ నీడ కూడా కష్టతరమైపోతుంది. కేవలం మన దేశమే కాదు.. జనాభా పెరుగుదలతో చాలా దేశాలు కష్టాలు పడుతున్నాయి. కానీ.. ఇటలీ మాత్రం తమ దేశంలోని ఓ నగరంలో జనాభా లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకప్పుడు ప్రజలతో కళకళలాడిన ఆ నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడకు వలస వచ్చే వారికి భారీ రాయితీలు ఇస్తామని స్థానిక ప్రభుత్వం అంటోంది. అవేంటో మీరు చదివి తెలుసుకోండి..

టెవోరా.. ఇటలీలోని ఓ పట్టణం. చుట్టు పచ్చటి కొండలు, సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటక ప్రాంతంగా ఆకట్టుకునేది. కానీ, 1980లో వచ్చిన భూకంపం ఈ నగరాన్ని అతలాకుతలం చేసింది. అపార ప్రాణ, ధన నష్టం కలిగించింది. దీంతో చాలా మంది అక్కడి నుంచి వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం టెవోరాలో కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉంది. అనేక భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, నిర్మాణాలు ఉన్నా సరిపడా ప్రజలు లేక నగరం బోసిపోతోంది. దీంతో స్థానిక ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని ఏ దేశం వారైనా.. కుటుంబమైనా ఈ నగరానికి వలస వచ్చి ఉండొచ్చని ఆహ్వానిస్తోంది. ఈ నగరంలో స్థిరపడటం కోసం వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. వలస వచ్చి ఈ నగరంలోనే స్థిరపడతానంటే వారికి రెండేళ్లపాటు ఇంటి అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుందట. అంటే అక్కడ అద్దె సుమారు 200 యూరోలు ఉంటే.. 150 యూరోలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అక్కడే ఇళ్లు కొనుక్కోవాలని భావిస్తే ప్రభుత్వమే రాయితీ కూడా ఇస్తుంది. ఆదాయపు పన్ను కూడా కట్టనవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే రెండేళ్లపాటు ప్రభుత్వం రాయితీలతో గడిపేసి మళ్లీ తిరిగి వెళ్లిపోతాం అంటే కుదరదు.. 

ఈ నగరంలో నివసించాలని భావించే వారు ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి. కనీసం మూడేళ్ల పాటు నివసిస్తామని, తమ పిల్లలను టెవోరాలోని స్థానిక పాఠశాలలోనే చేర్పిస్తామని హామీ ఇవ్వాలి. ‘‘చిన్నారులే భవిష్యత్తు. అలాంటి చిన్నారులు ఉన్న కుటుంబాలతో మా ప్రాంతం  పునరుజ్జీవం పొందనుంది.’’అని స్థానిక మేయర్‌ స్టెఫనో ఫరినా అన్నారు. అందుకే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ నగరమే కాదు.. ఇటలీలో జనాభా లేక చాలా నగరాలు వెలవెలబోతున్నాయి. దీంతో చాలా చోట్ల ఖాళీగా ఉన్న భవనాలను తక్కువ ధరకే స్థానిక ప్రభుత్వాలు అమ్మేస్తున్నాయి. ‘‘ఇతర నగరాల్లోలాగా భవనాలు అమ్మేస్తే ప్రజలు ఇక్కడ ఉండిపోతారని నేను అనుకోవట్లేదు. హాలీడేస్‌కి ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. అలా కాకుండా వారు స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలి.. అవసరాలు తీర్చాలి’’అని స్టెఫనో తెలిపారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని