అమెరికాలో భారతీయ వైద్యుడి దమనకాండ
అమెరికాలో భారతీయ వైద్యుడి దమనకాండ

వైద్యురాలిని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య

ఆసుపత్రిలోకి చొరబడి దౌర్జన్యం

హూస్టన్‌: భారతీయ అమెరికన్‌ వైద్యుడొకరు టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో భయోత్పాతం సృష్టించారు. ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలోకి తుపాకీతో చొరబడి అక్కడి సిబ్బందిని బందీలుగా పట్టుకోవడంతో పాటు ఓ వైద్యురాలిని కాల్చి చంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న పిల్లల వైద్యుడైన భరత్‌ నారుమంచి (43) ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

అక్కడి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భరత్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు ఇటీవలే నిర్ధరణ అయింది. అది తీవ్రస్థాయిలో ఉండటంతో ఆయన కొన్నివారాలే బతికే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన వారం క్రితం చిన్నపిల్లల వైద్య సేవల సంస్థ చిల్డ్రన్‌ మెడికల్‌ గ్రూప్‌ (సీఎంజీ)లో వాలంటీర్‌గా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. ఈ క్రమంలో భరత్‌ అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సీఎంజీ కార్యాలయంలోకి చొరబడి అక్కడున్న ఐదుగురు సిబ్బందిని తుపాకీతో బెదిరించి బందీలుగా పట్టుకున్నారు.
అయితే వారిలో కొందరు తప్పించుకున్నారు. కాసేపటి తర్వాత కేథరిన్‌ డాడ్‌సన్‌ అనే వైద్యురాలు మినహా మిగతావారిని భరత్‌ వదిలేశారు. భరత్‌ వద్ద తుపాకీతో పాటు రెండు బ్యాగులున్నాయని వారు అక్కడకు చేరుకున్న పోలీసులకు తెలిపారు. దీంతో అతడి వద్ద ఇంకేమైనా ఆయుధాలు ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు లోపలి పరిస్థితిని తెలుసుకోవడానికి కెమెరా ఉన్న రోబోను పంపించారు. అయితే అప్పటికే కేథరిన్‌తోపాటు భరత్‌ మరణించినట్లు తెలుసుకున్నారు.

అక్కడున్న పరిస్థితిని బట్టి కేథరిన్‌ను కాల్చి చంపిన అనంతరం భరత్‌ తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నామని, భరత్‌ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడన్నది తెలియాల్సి ఉందని వారు చెప్పారు. 

ఇదీ చదవండి..

అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు


Advertisement

Advertisement


మరిన్ని