Seva International USA: భారత్‌కు బాసటగా..
Seva International USA: భారత్‌కు బాసటగా..

47 లక్షల డాలర్లను సమీకరించిన ఎన్జీఓ

వాషింగ్టన్‌: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి ఓ ఇండియన్‌-అమెరికన్‌ ఎన్జీఓ 47 లక్షల డాలర్ల నిధులతోపాటు 2,184 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమీకరించింది. ఈ మొత్తాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినట్లు ఎన్జీఓ ‘సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏ’ తెలిపింది. నిధుల సమీకరణ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలుపెట్టిన 100 గంటల వ్యవధిలోనే దాదాపు 66,700 మంది ప్రవాస భారతీయులు వితరణ చేసినట్లు సేవా ఇంటర్నేషనల్‌ యూఎస్‌ఏ పేర్కొంది. వీలైనంత త్వరగా భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపడమే ప్రస్తుతానికి తమ ముందున్న లక్ష్యమని వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌లోని ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు చికిత్స సమర్థంగా అందేలా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సదరు సంస్థ స్పష్టం చేసింది. తాము సేకరించిన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు అత్యవసరంగా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది. 

కరోనాతో పరిస్థితులు దయనీయంగా మారిన వేళ భారత్‌కు సాయమందించేందుకు అనేక దేశాలు, పలు ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. సత్వర తోడ్పాటునందించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలు పంపేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. అమెరికాలోని 40 ప్రముఖ సంస్థలు ఏకతాటిపై వచ్చాయి. 20 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌కు 4.5 లక్షల రెమ్‌డెసివిర్‌ వెక్లూరి వయల్స్‌ను ఉచితంగా అందిస్తామని అమెరికాలోని ఫార్మా దిగ్గజం గిలీద్‌ వెల్లడించింది. బ్రిటన్‌ పంపించిన కొన్ని వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. వీటితోపాటు ఫ్రాన్స్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, ఐర్లండ్‌, బెల్జియం, పోర్చుగల్‌, స్వీడన్‌ సహా పలు దేశాలు భారత్‌కు సాయమందించేందుకు ముందుకొచ్చాయి.మరిన్ని