రక్తపుమడుగులో అమ్మానాన్న.. బాల్కనీలో చిన్నారి
రక్తపుమడుగులో అమ్మానాన్న.. బాల్కనీలో చిన్నారి

అమెరికాలో భారత దంపతుల అనుమానాస్పద మృతి

(ఫొటో: బాలాజీ ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి)

న్యూజెర్సీ: అప్పటిదాకా తనతో ఆడుకున్న అమ్మానాన్నలు ఎంత పిలిచినా లేవట్లేదు..! ఏం జరిగిందో తెలియక, ఏం చేయాలో అర్థంకాక అభం శుభం తెలియని ఆ నాలుగేళ్ల పాప బాల్కనీలో నిల్చుని వెక్కివెక్కి ఏడుస్తోంది. అది చూసిన ఇరుగుపొరుగువారు అయ్యో అంటూ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లగా.. చిన్నారి తల్లిదండ్రులు రక్తపుమడుగులో విగతజీవులుగా కన్పించారు. భారత్‌కు చెందిన దంపతులు దేశంకాని దేశంలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని బీద్‌ జిల్లాకు చెందిన 32ఏళ్ల బాలాజీ రుద్రావర్‌ ఐటీ ఉద్యోగి. 2015 ఆగస్టులో ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉండగా.. బాలాజీ భార్య ఆర్తి(30) ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం బాలాజీ కుమార్తె న్యూజెర్సీలోని నార్త్‌ ఆర్లింగ్టన్‌లో గల తన ఇంటి బాల్కనీలో ఏడుస్తూ కన్పించింది. చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో డోర్‌ బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. బాలాజీ, ఆయన భార్య లివింగ్‌ రూంలో రక్తపుమడుగులో కన్పించారు. ఇద్దరి శరీరాలపై బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బాలాజీ తన భార్యను పొడిచి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటారని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ మృతికి గల కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు. దంపతుల మృతిపై మహారాష్ట్రలో ఉంటున్న బాలాజీ కుటుంబానికి సమాచారమిచ్చారు. ‘‘నా కొడుకు, కోడలు చాలా ఆనందంగా ఉండేవారు. ఎవరితోనూ గొడవల్లేవు. ఎలా చనిపోయారో అర్థం కావట్లేదు’’ అని బాలాజీ తండ్రి భరత్‌ రుద్రావర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి.. మృతుడి స్నేహితుడి సంరక్షణలో ఉంది. అమెరికాలోని ఓ ప్రముఖ భారత ఐటీ సంస్థలో బాలాజీ ఐటీ నిపుణుడిగా ఉద్యోగం చేస్తుండగా.. అతని భార్య గృహిణి.

Advertisement

Advertisement


మరిన్ని