రైతులకు  ప్రవాసీయుల ‘గులాబీ’ మద్దతు
రైతులకు  ప్రవాసీయుల ‘గులాబీ’ మద్దతు

వాషింగ్టన్‌: అమెరికాలో ఉన్న భారతీయులకు చెందిన స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతన్నలకు తమ మద్దతు ప్రకటించాయి. ఆ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు ఏకమై..  నేడు ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్నమైన ‘రోజ్‌ క్యాంపెయిన్‌’ను ప్రారంభించాయి. గ్లోబల్‌ ఇండియన్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ (జీఐపీఏ) అనే సంస్థ సోషల్‌ మీడియా మాధ్యమంగా ఈ అంతర్జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తోంది.

పంజాబ్‌, హరియాణా తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది వ్యవసాయదారులు.. గత నవంబర్‌ నుంచి దిల్లీ శివార్లలోని పలు ప్రాంతాల్లో మకాం వేసి నిరసనలు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. నెలల తరబడి ప్రదర్శనలు చేస్తున్న రైతన్నలకు మద్దతుగా తాము ఈ ఆన్‌లైన్‌ ఉద్యమాన్ని చేపట్టామని సంస్థ తెలిపింది. ఇందులో పాల్గొని, భారతీయ రైతులకు మద్దతు తెలిపేందుకు గానూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గానీ, వారికి సమీపంలోని భారతీయ రాయబార కార్యాలయానికి లేదా జనరల్‌ కౌన్సిల్‌కు గానీ ఓ గులాబీని పంపాలని.. లేదా ఓ ట్వీట్‌ అయినా చేయాలని జీఐపీఏ విజ్ఞప్తి చేసింది.

కాగా, టీనేజ్‌ పర్యావరణవేత్త గ్రేటా థన్‌బర్గ్‌, పాప్‌ గాయని రిహాన్నా తదితరులు భారత్‌లో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి తమ మద్దతును ప్రకటించారు. కాగా, తమ దిల్లీలో కొనసాగుతున్న రైతు నిరసనలను దేశ అంతరంగిక వ్యవహారంగానే చూడాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ఈ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

థన్‌బర్గ్‌ టూల్‌కిట్‌ కేసులో తొలి అరెస్టు

ఎన్నికల్లో దుమ్మురేపిన భారతీయ విద్యార్థిని

 మరిన్ని