ఐరాస చీఫ్: అభ్యర్థిగా భారత సంతతి మహిళ
ఐరాస చీఫ్: అభ్యర్థిగా భారత సంతతి మహిళ

పురోగతి వైపు ప్రయాణించే ఐరాసకు అర్హులమని వెల్లడి

 

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి(ఐరాస) అత్యున్నత పదవికి పోటీ పడనున్నట్లు భారత సంతతికి చెందిన అరోరా ఆకాంక్ష(34) వెల్లడించారు. తదుపరి సెక్రటరీ జనరల్‌(ఎస్‌జీ)గా బాధ్యతలు స్వీకరించే లక్ష్యంతో ఆమె తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. భారత సంతతికి చెందిన ఆరోరా ఆకాంక్ష ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) కింద అడిట్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెక్రటరీ జనరల్ పదవికి తాను పోటీపడనున్నట్లు వెల్లడిస్తూ..AroraForSG హ్యాష్‌ట్యాగ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించారు.

‘75 సంవత్సరాలుగా..ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను ఐరాస నెరవేర్చలేకపోయింది. శరణార్థులకు రక్షణ కల్పించలేదు. మానవాళికి అందించే సాయం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. నూతన ఆవిష్కరణలు, సాంకేతికత విషయంలో వెనకే ఉన్నాం. పురోగతి వైపు ప్రయాణించే ఐరాసకు మనం అర్హులం’ అంటూ రెండున్నర నిమిషాల ప్రచార వీడియోలో ఆకాంక్ష పేర్కొన్నారు. ఐరాసను ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో ఇప్పటివరకు ఆ సంస్థను జవాబుదారీని చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తాను ఈ పదవి కోసం పోటీ పడుతున్నానన్నారు. పక్కన నిల్చొని అవకాశం కోసం వేచి చేసే వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదని ఆ వీడియోలో స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఐరాస సెక్రటరీ జనర‌ల్‌గా ఆంటోనియో గుటెర్రస్(71) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31కి ఆయన పదవీ కాలం ముగియనుంది. తదుపరి ఎస్‌జీ పదవీకాలం జనవరి 1, 2022 నుంచి ప్రారంభం కానుంది. అయితే తాను రెండో దఫా ఆ బాధ్యతలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు గుటెర్రస్ ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉండగా..75 ఏళ్ల ఐరాస చరిత్రలో ఇంతవరకు ఒక మహిళ ఆ పదవిని చేపట్టకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

కరోనా కేసులు తగ్గుతున్నాయని..నిర్లక్ష్యం వద్దుమరిన్ని