ప్రవాస భారతీయుల కోసం సరిగమల శిక్షణ!
ప్రవాస భారతీయుల కోసం సరిగమల శిక్షణ!

హైదరాబాద్‌: సంగీతం.. ఉరుకుల పరుగుల జీవితాలకు ఉపశమన మంత్రం. ఇక సంప్రదాయ కర్ణాటక సంగీతం గురించైతే చెప్పనవసరమే లేదు. వందల ఏళ్ల నాటి అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావనను నింపుతున్నాయి. వాటిని విశ్వవ్యాప్తం చేసేందుకు పన్నెండేళ్లుగా కృషి చేస్తోంది నగరానికి చెందిన సామవేద మ్యూజిక్‌ అకాడమీ. నగరంలోని పది శాఖల్లో ప్రత్యక్ష శిక్షణతో పాటు దాదాపు 30 దేశాల్లో ప్రవాస భారతీయులకు, విదేశీయులకు సంప్రదాయ సంగీతాన్ని నేర్పిస్తున్నారు సంగీత గురువు మీగడ వెంకట సుబ్బారెడ్డి. త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ సంస్థ గమనాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..

ఆత్మీయ స్వరాల నాదం

విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు సంగీతం నేర్చుకోవాలనే తపన ఉన్నా నేర్పేవారు అంతగా అందుబాటులో లేరు. ఈ పరిస్థితిల్లో వారికి ఆన్‌లైన్‌ వేదికగా సంగీత శిక్షణనిచ్చేందుకు.. నగరానికి చెందిన మీగడ వెంకట సుబ్బారెడ్డి 2008లో సామవేద మ్యూజిక్‌ అకాడమీని నెలకొల్పారు. వయోలిన్, వీణ, మృదంగం, కీబోర్డు, పిల్లనగ్రోవి, తబలాలను దాదాపు 20మందికి పైగా సుశిక్షితులైన గురువులు నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10వేల మందికి పైగా శిక్షణనందించారు. ప్రస్తుతం వేయి మంది ఈ సంస్థ వేదికగా తర్ఫీదు పొందుతున్నారు.

హైదరాబాద్‌లో గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌..ఇలా పదికి పైగా ప్రత్యక్ష శిక్షణ కేంద్రాలతో పాటు తిరుపతి, బెంగళూరు, విశాఖల్లోనూ శాఖలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా సంగీతం నేర్చుకునేందుకు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, జర్మనీ, శ్రీలంక తదితర దేశాల్లోని ప్రవాస భారతీయులు, విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘‘దక్షిణ భారత సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు అందరికంటే ముందు ఆన్‌లైన్‌ శిక్షణ ప్రారంభించాం. ప్రవాస భారతీయులు, విదేశీయులూ నేర్చుకుంటున్నారు.’’ అని ‘సామవేదం’ నిర్వాహకులు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి..

తానా ఎన్నికల షెడ్యూలు విడుదల

 

 

Advertisement

Advertisement


మరిన్ని