పుతిన్‌ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్‌
పుతిన్‌ మూల్యం చెల్లించక తప్పదు: బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల జోక్యం నేపథ్యంలో..

వాషింగ్టన్‌: ఈమధ్య జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు నష్టం వాటిల్లే విధంగా రష్యా ప్రయత్నించినట్లు అమెరికా జాతీయ ఇంటలిజెన్స్‌ విభాగం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఎన్నికల్లో తనను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వ్లాదిమిర్‌ పుతిన్‌ తన ప్రత్యర్థులతో క్రూరంగా ప్రవర్తిస్తాడని, అతనో ‘కిల్లర్‌’ అనే భావనను తాను కూడా నమ్ముతున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

బైడెన్‌ వ్యాఖ్యలను ఖండించిన రష్యా..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఓ కిల్లర్‌ అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొనడాన్ని రష్యా ఖండించింది. తన వ్యాఖ్యలతో రష్యా దేశ ప్రజలను జో బైడెన్‌ అవమానించారంటూ రష్యా పార్లమెంట్‌ దిగువసభ స్పీకర్‌ వ్యాచెస్లావ్‌ వొలోడిన్‌ ప్రకటించారు. పుతిన్‌పై చేసే దాడి దేశంమీద చేసిన దాడిగానే భావిస్తామన్నారు.

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు లబ్ధిచేకూర్చి బైడెన్‌ను నష్టపర్చేలా రష్యా ప్రయత్నాలు చేసినట్లు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ విభాగం డైరెక్టర్‌ యావ్రిల్‌ హెయిన్స్‌ ధ్రువీకరించారు. ట్రంప్‌నకు సన్నిహితులైన అధికారులను వినియోగించుకొని బైడెన్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా మళ్లీ జోక్యం చేసుకున్నట్లు వచ్చిన వార్తలు ఆ రెండు దేశాల మధ్య మరింత వేడిని రాజేశాయి.


మరిన్ని