‘టీకా పంపిణీలో అపూర్వ విజయం సాధించాం’
‘టీకా పంపిణీలో అపూర్వ విజయం సాధించాం’

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా టీకాల పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన గడువు కన్నా ముందే సాధించడంపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో 200 మిలియన్ల టీకా డోసుల పంపిణీ పూర్తయిన సందర్భంగా ఆయన ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

‘దేశంలో 200 మిలియన్ల డోసుల పంపిణీ లక్ష్యాన్ని మనం నేటితో పూర్తి చేశాం. ఇది మన సాధించిన అసాధారణ విజయం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనం సాధించిన ఈ పురోగతి అద్వితీయమైనది. ఈ సమయంలో మనం అప్రమత్తంగా లేకపోతే వైరస్‌ మళ్లీ మన పురోగతిని దెబ్బతీస్తుంది’ అని బైడెన్‌ హెచ్చరించారు.

అమెరికాలో జనవరి 20న బైడెన్‌ ప్రభుత్వం కొలువు దీరాక తొలి వంద రోజుల్లో 100 మిలియన్‌ డోసులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, అది వేగంగా పూర్తి కావడంతో.. లక్ష్యాన్ని 200 మిలియన్ డోసులకు పెంచారు.   తాజాగా ఆ మార్క్‌ను కూడా ప్రభుత్వం వారం గడువు ముందుగానే పూర్తి చేయడం విశేషం. 

కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికానే మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 3.26 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో పోరాడుతూ మొత్తం 5,83,330 మంది ప్రాణాలు వదిలారు. 


మరిన్ని