ట్రంప్‌ వలస విధానాలకు టాటా 
ట్రంప్‌ వలస విధానాలకు టాటా 

3 కీలక ఉత్తర్వులపై బైడెన్‌ సంతకం  
తల్లిదండ్రుల ఒడికి చేరనున్న వేలమంది చిన్నారులు  

వాషింగ్టన్‌: వలసల విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశపెట్టిన కఠిన విధానాలకు చరమగీతం పాడేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. తమ దేశ ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను ఈ ఉత్తర్వులు మరింత పారదర్శకంగా మారుస్తాయని, మానవతా దృక్పథానికి ప్రాధాన్యమిస్తూ వాటిని తీసుకొచ్చామని శ్వేతసౌధంలో ఆయన తెలిపారు. ట్రంప్‌ హయాంలో దారుణమైన నిబంధనల కారణంగా వేరుపడ్డ తల్లిదండ్రులు, పిల్లలు మళ్లీ ఏకమయ్యేందుకు అవి దోహదపడతాయని పేర్కొన్నారు. తానేమీ నూతన చట్టాలు చేయట్లేదన్నారు. చెడు విధానాన్ని మాత్రమే తొలగిస్తున్నానని చెప్పారు. అమెరికా పౌరసత్వాన్ని పొందాలన్న వేలమంది భారతీయ నిపుణుల కలలు సాకారమయ్యేందుకు బైడెన్‌ ఉత్తర్వులు ఉపయోగపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇవీ ఉత్తర్వులు.. 
మెక్సికో సరిహద్దును దాటి అమెరికాలోకి ప్రవేశించిన పలువురి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో.. వారి నుంచి చిన్నారులను ట్రంప్‌ ప్రభుత్వం వేరుచేసింది. వారిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచింది. దాదాపు 5,500 కుటుంబాలు ఇలా విడిపోవాల్సి వచ్చిందని అంచనా. వారందర్నీ గుర్తించి, చిన్నారులను తల్లిదండ్రులతో కలిపేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటుచేయడం తాజాగా బైడెన్‌ సంతకం చేసిన తొలి కార్యనిర్వాహక ఉత్తర్వు ఉద్దేశం. 

► వలసలకు మూల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయడంతోపాటు మానవతా దృక్పథంతో కూడిన శరణార్థ వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా రెండో ఉత్తర్వును జారీ చేశారు. 
► ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థంగా పనిచేసేందుకు మూడో ఉత్తర్వు దోహదపడుతుంది. గృహ రాయితీల వంటి ప్రయోజనాలు పొందేవారు అమెరికాలో శాశ్వత నివాస హోదా / గ్రీన్‌కార్డును పొందకుండా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను ఇది రద్దు చేయనుంది. 

చైనా దూకుడుకు కళ్లెం వేస్తాం: అమెరికా 
చైనాతో తమకు తీవ్ర పోటీ ఉందని అమెరికా అంగీకరించింది. ఆ దేశ దూకుడుకు కళ్లెం వేస్తామని ఉద్ఘాటించింది. ఇటీవల కాలంలో డ్రాగన్‌ చర్యలు తమ పౌరుల ప్రయోజనాలకు విఘాతం కలిగించాయని.. అమెరికా కూటములకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. 

ఇమ్మిగ్రేషన్‌ కార్యదళం ఉమ్మడి అధ్యక్షుడిగా రాజా కృష్ణమూర్తి 
ప్రముఖ భారతీయ అమెరికన్‌ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి కీలక పదవిని దక్కించుకున్నారు. కాంగ్రెషనల్‌ ఆసియన్‌ పసిఫిక్‌ అమెరికన్‌ కాకస్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్‌ కార్యదళానికి ఉమ్మడి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. డ్రీమర్లు, తాత్కాలిక రక్షణ హోదా (టీపీఎస్‌) ఉన్నవారికి రక్షణ కల్పించడం, ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో సంస్కరణలకు సహకరించడం వంటి ఈ కార్యదళం లక్ష్యాలు. మరో భారతీయ అమెరికన్‌ చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్‌ ఈ కార్యదళానికి అధ్యక్షురాలు కావడం విశేషం. మరోవైపు- అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రధాన వైద్యాధికారిగా భారతీయ అమెరికన్‌ డాక్టర్‌ ప్రితేష్‌ గాంధీని బైడెన్‌ నియమించారు.

ఇవీ చదవండి..
సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు

గాజీపుర్‌కు విపక్ష బృందం.. అడ్డుకున్న పోలీసులు


మరిన్ని