కళాతపస్వికి అమెరికాలో స్వరాభిషేకం 
కళాతపస్వికి అమెరికాలో స్వరాభిషేకం  

హ్యూస్టన్ /టెక్సాస్: లెజెండరీ సినీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత కళాతపస్వి డాక్టర్‌ కె.విశ్వనాథ్‌ 91వ పుట్టిన రోజు వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. గాయని శారద ఆకునూరి- అమెరికా; వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ ద్వారా నిర్వహించారు. శారద ఆకునూరి నిర్వహణ/ వ్యాఖ్యాతగా కొనసాగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు విశ్వనాథ్‌తో చేసిన చిత్రాల్లో అనుభవాలు, తమకు ఉన్న అనుబంధాన్ని  గుర్తుచేసుకున్నారు. కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు  చిత్ర కథానాయిక మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. ఆపద్బాంధవుడు చిత్రంలో కథానాయికగా తనకు నంది పురస్కారం వచ్చిందన్నారు. ఆనాటి షూటింగ్ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’ చిత్ర కథానాయకి జమున రమణారావు మాట్లాడుతూ..  విశ్వనాథ్‌ ప్రతిభను, దర్శకత్వ విలువలను, చిత్రీకరణ విధానాన్ని అభినందించడంతో పాటు ఆయనతో తనకు ఉన్న ఆనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

‘సూత్రధారులు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ సినీ నటులు ఎం.మురళీమోహన్ మాట్లాడుతూ.. కళా ఖండాలు నిర్మించే విశ్వనాథ్ చిత్రాల్లో తానూ నటించాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక ‘సూత్రధారులు’తో తీరిందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరపురాని ఓ ఆదర్శవంతమైన దర్శకుడు విశ్వనాథ్ అని కొనియాడారు. ‘సిరిసిరిమువ్వ, శుభోదయం, ఓ సీతకథ, సీతామాలక్ష్మి’ వంటి  చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన చంద్రమోహన్ మాట్లాడుతూ.. తనకెన్నో చిత్రాల్లో హీరో పాత్రలు ఇచ్చి తన పురోభివృద్ధికి తోడ్పడిన సోదర సమానులు కె.విశ్వనాథ్ అని గుర్తుచేసుకున్నారు.

‘ఓ సీతకథ’ చిత్రంలో తనకు నాయిక పాత్రను ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించారని నటి రోజారమణి అన్నారు. నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు ఏడిద రాజా మాట్లాడుతూ..  "శంకరాభరణం, సాగరసంగమం, సిరిసిరి మువ్వ, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, స్వయంకృషి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ‘పూర్ణోదయా’కు  ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన దర్శకులు విశ్వనాథ్ గారు" అని అన్నారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి గాయనీ గాయకులు విశ్వమోహన్, చంద్రహాస్, రాధికా నోరి, ప్రసాద్ ఘంటా, శ్రీకర్ దర్భ, జీవీ ప్రభాకర్, శృతి,  ఉష, శ్రీనివాస్ దుర్గం, సంతోష్ నందగిరి, ప్రసాదం కొమ్మరాజు, జ్యోతి,కృష్ణ, శరత్ పసుమర్తి,  లావణ్య, శ్రీనివాస్ వడ్లమాని పాల్గొని విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలను ఆలపించి ప్రేక్షకులకు వీనులవిందు చేశారు. కె.విశ్వనాథ్‌కు ఎన్నోసార్లు వంశీ-బెర్కెలీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా సత్కరించామని శిరోమణి వంశీ రామరాజు అన్నారు. ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. తన చిత్రాల్లోని పాటలను ఆలపించిన గాయనీ గాయకులకు అభినందలు తెలిపారు.


Tags :

మరిన్ని