తేనెలొలికే తెలుగు.. భవితకదే వెలుగు
తేనెలొలికే తెలుగు.. భవితకదే వెలుగు

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హైదరాబాద్‌: ద్రవిడ భాషల్లో తొలిసూరు బిడ్డలాంటి మన తెలుగు భాషను కొత్త తరం మరో తీరానికి తీసుకొని వెళ్తోంది. అత్తరు పరిమళాలతో మన భాష కొత్త సింగారాలను దిద్దుకుంటోంది.. ఆంగ్ల భాష మీద యావతో అమ్మభాషను మరవకుండా.. భావితరాలకు అందిద్దామని సూచిస్తోంది.. నేడు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగును ఈ తరానికి సరికొత్తగా పరిచయం చేస్తున్న, అమ్మభాషతోనే ఈ స్థాయికి వచ్చామని చెబుతున్నారు కొందరు. వారు ఏమంటున్నారో చూద్దాం..

ఆంగ్లంలో చదివా...తెలుగులో రాణించా - ప్రణవ్‌ చాగంటి, ర్యాపర్‌

ఇంజినీరింగ్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలోనే కొనసాగింది. చిన్నప్పటి నుంచి తెలుగు భాష అభిమానం ఎక్కువే. నా కలం పేరు అభినవ కవి. మనసులో ఉన్న భావాల్ని స్పష్టంగా వ్యక్తపరచాలంటే అది మాతృభాషలోనే సాధ్యం. ఉన్నత విద్య పూర్తయిన తర్వాత.. తెలుగులోనే ర్యాప్‌ చేయడం మొదలుపెట్టాను. ‘కాలా’, ఆకాశం నీ హద్దురా, అల వైకుంఠపురం, ఈ నగరానికి ఏమైంది, హలో, పైసా వసూల్, మెంటల్‌ మదిలో, యుద్ధం శరణం సినిమాల్లో గీతాలు స్వయంగా రాసి, పాడాను.

చిన్నప్పటి నుంచి అభిమానం - ప్రియశ్రీ, మలేసియా తెలుగు అసోసియేషన్‌

మలేసియాలో పుట్టిపెరిగినప్పటికీ తెలుగు భాషాభిమానం ఏర్పడింది మా అమ్మా, నాన్నల వల్లే. భాష అందర్నీ కలుపుతుంది. ప్రస్తుతం మలేసియాలో తెలుగు భాషాభివృద్ధిలో చాలా మంది తెలుగువాళ్లం కలిసి పనిచేస్తున్నాము. ‘ది తెలుగు ప్రాజెక్టు’ ద్వారా మన కళల్ని, కళాకారుల్ని పరిచయం చేస్తున్నాను. ఏటా నిర్వహించే ఉగాది సంబరాలకు మలేసియాలోని సుమారు 10వేల మంది తెలుగువారు హాజరవుతుంటారు. మన భాష నేర్పించడానికి మలేసియాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం.

Advertisement

Advertisement


మరిన్ని