ప్రవాస భారతీయుడి గిన్నిస్‌ రికార్డు
ప్రవాస భారతీయుడి గిన్నిస్‌ రికార్డు

అత్యధిక గిన్నిస్‌ రికార్డులు రాంకుమార్‌ సొంతం

దుబాయ్‌: యూఏఈలో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్‌ కార్డుతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్‌ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్‌ సారంగపాణి రూపొందించినట్లు దుబాయ్‌ మీడియా శనివారం వెల్లడించింది. దీనిని షేక్‌ మొహమ్మద్‌కు అంకితమిచ్చినట్లు తెలిపింది.

తాజా రికార్డుతో రాంకుమార్‌ ఖాతాలో 19 గిన్నిస్‌ రికార్డులు చేరాయి. యూఏఈ, భారత్‌ల్లో అత్యధిక గిన్నిస్‌ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్‌ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది. ఈ కార్డులో దుబాయ్‌ చిత్రకారుడు అక్బర్‌ సాహెబ్‌ గీసిన.. షేక్‌ మొహమ్మద్‌ చిత్రాలున్నట్లు పేర్కొంది. సాధారణ కార్డు కన్నా ఇది 100 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు వివరించింది. గతంలో 6.729 చదరపు మీటర్ల గ్రీటింగ్‌ కార్డుతో హాంకాంగ్‌కు చెందిన వ్యక్తి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పగా.. రాంకుమార్‌ తాజాగా దానిని అధిగమించారు. ‘‘ఆరు నెలలు శ్రమించి ఈ కార్డును రూపొందించాను. యూఏఈ 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా దీనిని దేశానికి అంకితమిస్తున్నాను’’ అని రాంకుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

ఆస్ట్రేలియాలో నాగర్‌కర్నూల్‌ యువతి మృతి

బ్రిటన్‌ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు


Advertisement


మరిన్ని