గానకోకిల సుశీలకు శతమానం భవతి
గానకోకిల సుశీలకు శతమానం భవతి

10గంటల్లో 100 పాటలతో ‘పాటకు పట్టాభిషేకం’

ఇంటర్నెట్‌ డెస్క్‌: పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి. సుశీల పాడిన తెలుగు సినీగీతాలలోని 100 ఆణిముత్యాల్లాంటి పాటలతో "గానకోకిల పాటకు పట్టాభిషేకం" అనే పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా ఈ నెల 21న దాదాపు 10గంటలపాటు నిర్విరామంగా నిర్వహించారు. ప్రముఖ నటీమణి, కళాభారతి డాక్టర్ జమున రమణారావు గారి చేతులమీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత్, సింగపూర్, అమెరికా దేశాల నుంచి 12 మంది ప్రముఖ గాయనీమణులు సుశీల పాటలను ఆలపించి అలరించారు.  ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి కోటి, మాధవపెద్ది సురేశ్‌, స్వర వీణాపాణి వంటి ప్రముఖులు గౌరవ అతిథులుగా విచ్చేసి సుశీల పాటల గురించి,  ఆమెతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. 

రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో జరిగిన ఈ అద్వితీయ సంగీత మహోత్సవ కార్యక్రమంలో రాధిక నోరి (అమెరికా), విజయలక్ష్మి భువనగిరి, సురేఖ మూర్తి దివాకర్ల, వేదాల శశికళ స్వామి, శారదా రెడ్డి, శివశంకరి గీతాంజలి, శారద సాయి, శ్రీదేవి, రావూరి మాధవి, హిమబిందు, శైలజా చిలుకూరి (సింగపూర్), సౌభాగ్యలక్ష్మీ (సింగపూర్) 12 మంది సుమధుర గాయనీమణులు 100 పాటలను ఆలపించారు. అలాగే, వంశీ ఇంటర్నేషనల్, సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, సాంస్కృతిక కళాసారథి - సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షులు  కవుటూరు రత్నకుమార్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక మంగిపూడి, శారదా కళాసమితి అధ్యక్షులు దోగిపర్తి శంకర్‌రావు తదితరులు ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించి సుశీలకు తమ ప్రత్యేక అభినందనలు తెలిపారు.మరిన్ని