​​​​​​గాయకుడు ఆనంద్‌కు అంతర్జాలంలో ఘన నివాళి
​​​​​​గాయకుడు ఆనంద్‌కు అంతర్జాలంలో ఘన నివాళి

హ్యూస్టన్: కరోనా కారణంగా కన్నుమూసిన ప్రముఖ గాయకుడు జి.ఆనంద్‌కు పలువురు ప్రముఖులు అంతర్జాలంలో నివాళులర్పించారు. ఏడు దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా, శారద ఆకునూరి (అమెరికా) సంయుక్త ఆధ్వర్యంలో అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆనూరి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో గాయకుడిగా, ‘స్వరమాధురి’ సంస్థ ద్వారా ఆనంద్‌ 6,500కు పైగా కచేరీలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఎందరో గాయనీ, గాయకులను తయారు చేసిన అలాంటి వ్యక్తి సరైన వైద్య సదుపాయం అందక మరణించడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. జాతి సంపదలాంటి కళాకారులను కాపాడుకోవడానికి అలాంటి వారిని ప్రత్యేకంగా ఆదుకునే విధానం ఉండాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను, ఆనంద్‌తో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు.

ఆనంద్‌ పేరిట ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని న్యూజెర్సీ నుంచి దాము గేదెల అన్నారు. తాను నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన గాత్రం ఇచ్చారని సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్‌ గుర్తుచేసుకున్నారు. వెంటిలేటర్‌ దొరక్క ఒక గాయకుడు మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ద ప్రసాద్, ఘంటసాల రత్నకుమార్, భువన చంద్ర, మాధవ పెద్ది సురేష్, ఆర్పీ పట్నాయక్‌, సురేష్ కొండేటి, సారిపల్లి కొండలరావు, డాక్టర్‌ నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాస్, శారద సింగిరెడ్డి, దాము గేదెల, రవి కొండబోలు, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్, హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం, సురేఖ మూర్తి దివాకర్ల, జీవీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆనంద్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. సంతోషం ట్రినెట్‌ లైవ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, సంతోషం సురేష్‌ యూట్యూబ్‌ ఛానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేశాయి.


మరిన్ని