ఆద్యంతం అలరించేలా సాగిన శివపద గీతాలాపన
ఆద్యంతం అలరించేలా సాగిన శివపద గీతాలాపన

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ అత్యద్భుతంగా రచించిన శివపద గీతాల పోటీ కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా ఘనంగా జరిగింది. వాణి గుండ్లపల్లి, రవి గుండ్లపల్లి, మేఘన, నాగ సంపత వారణాసి బృందం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 9 దేశాల నుంచి చిన్నా పెద్దా ఈ పాటల పోటీలో పాల్గొన్నారు. వయసుల వారీగా ‘ఉపమన్యు’, ‘మార్కండేయ’, ‘భక్త కన్నప్ప’, ‘నత్కీర’, ‘పుష్పదంత’ వంటి శివభక్తుల పేర్లతో పోటీదారులను విభజించారు. 11 మంది ప్రఖ్యాత సంగీత గురువులు అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్‌ల నుంచి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. భారత్‌ నుంచి తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, శారదా సుబ్రమణియన్, కౌశిక్ కల్యాణ్, సాయి కృష్ణ, పెద్దాడ సూర్యకుమారి.. అమెరికా నుంచి పావని మల్లాజ్యోస్యుల, సవిత నముడూరి, లక్ష్మి కొలవెన్ను.. సింగపూర్ నుంచి పద్మావతి.. ఆస్ట్రేలియా నుంచి పద్మా మల్లెల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.

శివపదం తనకోసం, తన జీవిత పరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలని షణ్ముఖ శర్మ అన్నారు. ఇంతమంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రవాస చిన్నారులు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ తప్పకుండా అద్భుతముగా శివపద గీతాలను ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, పటికంపు ఛాయ, గిరులే శ్రుతులు, శివుడు ధరించిన, సకల మంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ మొదలుకుని దాదాపు 150 పైగా శివపదాలను అద్భుతంగా, వీనులవిందుగా పాడారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని, ఇంతటి బృహత్కార్యక్రమాన్ని ఎంతో శ్రమకోర్చి అత్యుత్తమంగా నిర్వహించిన వాణి, రవి గుండ్లపల్లిని వీక్షకులు అభినందించారు.


మరిన్ని