తానా  ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా శ్రీనివాస గోగినేని పోటీ
తానా  ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా శ్రీనివాస గోగినేని పోటీ

 ‘తానా మనందరిదీ’ అంటున్న తెలుగు నేత

టెక్సాస్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు త్వరలో జరగనున్న ఎన్నికల్లో.. ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ పదవికి తాను మరోసారి పోటీ చేస్తున్నట్లు శ్రీనివాస గోగినేని ప్రకటించారు. 10 సంవత్సరాల పాటు తానాలో కీలక పదవులు నిర్వహించిన తనకు.. సంస్థతో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉందని ఆయన వివరించారు. తానా నేతగా అమెరికా వ్యాప్తంగా ఉన్న గుర్తింపు కారణంగా తనకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. 2015 నుంచి 2017 వరకు తానా ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్న తాను.. అమెరికాలోని ఇరవైకి పైగా ప్రముఖ నగరాల్లో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టు శ్రీనివాస వివరించారు. ఆపై తానా కాన్ఫరెన్స్ సెక్రటరీగా, తానా బోర్డు సభ్యునిగా అనేక  పదవుల్లో విశిష్ఠ సేవలందించానన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు

తానా  సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సేకరించిన కోట్లాది రూపాయల విరాళాలతో తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా.. చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా నేత్ర శిబిరాలు, క్యాన్సర్‌ నివారణ క్యాంపులు,  గ్రహణం మొర్రి శస్త్ర చికిత్సలు,  సాధారణ,  డిజిటల్ గ్రంథాలయాలు, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థులకు ఉపకారవేతనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక వారధి కార్యక్రమం ద్వారా పలువురు చిన్నారులకు విద్యావకాశాలు కల్పించామని ఆయన వెల్లడించారు.  ఈ  కార్యక్రమాల ద్వారా వేలాది మందికి లబ్ది కలిగిందని గోగినేని వివరించారు. ‘మన ఊరికోసం’, ‘5కే రన్’‌ తదితర కార్యక్రమాల్లో స్థానికంగా ఉంటున్న తెలుగు వారిని భాగస్వాములుగా చేసి.. వాటిని విజయవంతం చేశామని శ్రీనివాస తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా.. కలసి నడుద్దాం

‘తానా మనందరిదీ’ అనే నినాదంతో పోటీ చేస్తున్నట్టు శ్రీనివాస గోగినేని  వివరించారు. కొత్త సంస్కరణలు, విలువల పరిరక్షణతో సంస్థ తిరిగి గర్వపడేలా చేసేందుకు తనతోపాటు కలసి రావాలని ఆయన ఈ సందర్భంగా సభ్యులకు పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే తానాను అన్నివర్గాలకు చేరువ చేస్తానన్నారు. అంతేకాకుండా మహిళలు , యువత  పాల్గొనేలా సంస్థ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమెరికాలో ఉన్న పలు తెలుగు సంస్థలతో కలసి ఐకమత్యంగా  తెలుగు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇదీ చదవండి..

వెన్నెలకంటికి తానా సంతాపం


మరిన్ని