Britain: రారమ్మని.. వచ్చి చదువుకొమ్మని.. భారతీయ విద్యార్థులకు తలుపులు బార్లా 
Britain: రారమ్మని.. వచ్చి చదువుకొమ్మని.. భారతీయ విద్యార్థులకు తలుపులు బార్లా  

ఈ ఏడాది 3,200 మందికి ఆహ్వానం
గతేడాది కన్నా 19 శాతం అధికం

లండన్‌: భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ ఎర్ర తివాచీ పరుస్తోంది. ఉన్నత విద్య కలలతో తమ దేశం వైపు చూస్తున్నవారిని రారమ్మని సాదరంగా ఆహ్వానిస్తోంది. తమ విద్యాసంస్థల్లో చదవడానికి వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకుంటూ పోతోంది. 2021కిగానూ రికార్డు స్థాయిలో ఆశావహులకు సింహాసనం వేసింది. కేంద్రీకృత దరఖాస్తు విధానం ద్వారా యూకే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఏకంగా 3,200 మందికి ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 19 శాతం అధికం కావడం విశేషం. ‘ది యూనివర్సిటీస్‌ అండ్‌ కాలేజెస్‌ అడ్మిషన్స్‌ సర్వీస్‌(యూసీఏఎస్‌)’ మంగళవారం ఈ వివరాలను విడుదల చేసింది.

మహమ్మారి నేపథ్యంలో ప్రయాణ నిషేధానికి సంబంధించి భారత్‌ను కొన్ని రోజుల క్రితమే రెడ్‌ జాబితా నుంచి ఆంబర్‌ జాబితాకు మార్చి ఊరట కలిగించిన బ్రిటన్‌.. ఇప్పుడు విద్యార్థులకు తీపి కబురు వినిపించింది. బ్రిటన్‌ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు  భారతీయ విద్యార్థులకు మేలు చేకూరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు ముందు బ్రిటన్‌కు వెళ్లేవారు 10 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించే క్వారంటైన్‌ ప్రదేశాల్లో గడపాల్సి వచ్చేది. దీనికయ్యే వ్యయం వారికి భారంగా ఉండేది. కానీ ఇకమీదట విద్యార్థులు విశ్వవిద్యాలయాల హాస్టళ్లు లేదా తాము ఎంపిక చేసుకున్న చోట క్వారంటైన్‌లో గడపొచ్చు. మరోవైపు గత జులైలో అమల్లోకి వచ్చిన యూకే పోస్ట్‌ స్టడీ వీసా కూడా భారతీయ విద్యార్థులకు వరంలా మారింది. చదువు పూర్తయిన తర్వాతా రెండేళ్ల వరకూ బ్రిటన్‌లోనే ఉండి ఉద్యోగానుభవం సంపాదించుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. 

Advertisement

Advertisement


మరిన్ని