చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదు: బైడెన్‌
చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదు: బైడెన్‌

వాషింగ్టన్‌: చట్టం ముందు అందరూ సమానులే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకేసులో పోలీస్‌ అధికారి డెరిక్‌ చౌవిన్‌ను దోషిగా నిర్ధారిస్తూ మిన్నెసోటా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన మంగళవారం ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు.

‘చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదు. ఆ దిశలో ఈ రోజు వచ్చిన తీర్పు మంచి సందేశాన్నిచ్చింది. కానీ ఇది సరిపోదు. ఇక్కడితోనే మనం ఆగిపోకూడదు. వ్యవస్థలో నిజమైన మార్పు తీసుకురావాలి. ఇలాంటి విషాద ఘటనలు తగ్గించేలా మనం తప్పక కృషి చేయాలి. ‘ఐ కాంట్‌ బ్రీత్‌’(నాకు శ్వాస ఆడటం లేదు) అన్న జార్జ్‌ చివరి మాటల్ని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. నేటి తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో ఇదో గొప్ప ముందడుగు’ అని బైడెన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ పేరిట అర్థవంతమైన పోలీసు సంస్కరణ చట్టాన్ని రూపొందిస్తున్నామని.. అయితే, దాన్ని తీసుకురావడానికి సంవత్సర కాలం పట్టాల్సింది కాదని బైడెన్‌ అన్నారు.

గతేడాది అమెరికాలో శ్వేతజాతి మాజీ పోలీసు అధికారి కర్కశత్వం కారణంగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు మరణించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ పోలీసు అధికారి డెరిక్‌ చౌవిన్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
Advertisement


మరిన్ని