కెనడాలో భారతీయులకు బెదిరింపులు..
కెనడాలో భారతీయులకు బెదిరింపులు..

ఆందోళన వ్యక్తం చేసిన భారత రాయబార కార్యాలయం

ఒట్టావా: కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు ఎదురవటంతో.. భద్రత పట్ల ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించటంతో వీరికి పలు బెదిరింపులు ఎదురైనట్టు ఆంగ్ల మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఇక్కడి భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అత్యాచారం, హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వారి వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ హెచ్చరికలు ఎదురైనట్టు వెల్లడైంది.

దీంతో గ్రేటర్‌ టొరంటో, వాంకూవర్‌, మెట్రో వాంకూవర్‌, కాల్గరీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడున్న 28 కెనడా భారతీయ సంఘాలు ఈ అంశాన్ని కెనడా ప్రజా భద్రత, అత్యవసర సంసిద్ధత శాఖా మంత్రి బిల్‌ బ్లెయర్‌కు ఓ లేఖ ద్వారా తెలియచేశారు. ఈ నేపథ్యంలో బెదిరింపులను ఎదుర్కొన్న కెనడా భారతీయులు, ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు వెంటనే తెలియచేయాల్సిందిగా కెనడాలో భారతీయ హై కమిషనర్‌ అజయ్‌ బసారియా సూచించారు.


మరిన్ని