ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ రాకపోవడమే మంచిది
ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ రాకపోవడమే మంచిది

ఆయన అసమర్థ అధ్యక్షుడు: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ దుయ్యబట్టారు. ప్రెసిడెంట్‌ పదవిలో కొనసాగేందుకు తగిన వ్యక్తి కాదని అన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ ప్రమాణస్వీకారానికి హాజరుకాబోనని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు. ఆయన రాకపోవడమని మంచిదని బైడెన్‌ ఎద్దేవా చేశారు. 

‘ప్రమాణస్వీకారానికి రాబోనని ట్రంప్‌ అన్నట్లు తెలిసింది. చాలా కొన్ని విషయాల్లో మాత్రమే మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఆయన కార్యక్రమానికి రాకపోవడమే మంచిది. ఆయన ఈ దేశానికి ఇబ్బందికరంగా మారారు. తన చేష్టలతో మమ్మల్ని కూడా ఇబ్బందిపెడుతున్నారు. అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఆయన అర్హుడు కాదు’ అని డెలావేర్‌లో విలేకరులతో మాట్లాడుతూ బైడెన్‌ అన్నారు. దేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షుడు ఆయనే అని ట్రంప్‌పై ధ్వజమెత్తారు. 

ఇప్పుడు యావత్ అమెరికా ప్రజలు ఆయన ఎప్పుడెప్పుడా దిగిపోతారా అని చూస్తున్నారని బైడెన్‌ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌పై అభిశంసన వార్తలపై ప్రశ్నించగా.. అది పూర్తిగా కాంగ్రెస్‌కు సంబంధించిన విషయమని, దీనిపై ఉభయ సభలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. అయితే తాను కూడా ట్రంప్‌ అధ్యక్ష పదవిని వీడే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని బైడెన్‌ చెప్పారు. 

మరికొద్ది రోజుల్లో పదవీకాలం పూర్తిచేసుకునే ట్రంప్‌.. చివరి రోజుల్లో తన విపరీత చర్యలతో భంగపాటుకు గురవుతున్నారు. అగ్రరాజ్యానికి తలవొంపులు తెచ్చేలా ఇటీవల ఆ దేశ క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడిపై వ్యతిరేకత తారస్థాయికి చేరింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని అటు డెమొక్రాట్లతో పాటు సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్‌ చేయడం గమనార్హం. ట్రంప్‌ తనంతట తానే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే అభిశంసన తీసుకొస్తామని అమెరికా చట్టసభ్యులు అంటున్నారు. మరోవైపు క్యాపిటల్‌ భవనంపై దాడి నేపథ్యంలో ఆయన ట్విటర్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ఆ సోషల్‌మీడియా సంస్థ ప్రకటించింది. 

ఇవీ చదవండి..

ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం!

నన్ను నేనే క్షమించుకుంటా!


మరిన్ని