అందమైన నగరం.. కానీ, అక్కడ ఒక్కరూ ఉండరు!
అందమైన నగరం.. కానీ, అక్కడ ఒక్కరూ ఉండరు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న సైప్రస్‌ అనే ద్వీపంలో ఫమగుస్టా అనే నగరముంది. ఆ నగరంలో వరోషా పేరుతో ఓ ప్రాంతముంది. ఒకవైపు సముద్ర తీరం.. మరోవైపు బహుళ అంతస్తుల మేడలు.. విశాలమైన రోడ్లు.. సకల వసతులు ఆ ప్రాంతం సొంతం. కానీ అది ఒకప్పుడు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతం నిర్మానుషంగా ఉంటోంది. ఒకప్పుడు వేలమంది ప్రజలకు నివాసంగా.. పర్యటకులకు సందర్శక ప్రాంతంగా ఉన్న వరోషా ఇప్పుడు మోడు వారిపోయింది. ఆ ప్రాంతం చుట్టూ కంచెలు వేసి వెలుపలి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. ఎందుకలా? ఆ ప్రాంతానికేమైంది?

1970ల వరకు సైప్రస్‌లోని ఫమగుస్టా ప్రముఖ సందర్శక ప్రాంతంగా ఉండేది. అప్పట్లో అక్కడి జనాభా దాదాపు 40వేల వరకు ఉండేదట. అన్ని నగరాల్లాగే ఫమగుస్టా నగరం.. అందులోని వరోషా ప్రాంతం ప్రజలతో కళకళాడుతుండేది. అయితే, 1974 జులైలో సమీప దేశమైన టర్కీ తన సైన్యంతో సైప్రస్‌ ఐలాండ్‌పై దాడి చేసింది. దీంతో ఫమగుస్టా, వరోషా ప్రాంతాల్లో ఉండే గ్రీస్‌ దేశస్థులు, టర్కీ సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల ఘర్షణలు మారణహోమానికి దారి తీసే ప్రమాదముందని గ్రహించిన అక్కడి ప్రభుత్వం వరోషా ప్రాంతంలోని ప్రజలందరినీ రాత్రికి రాత్రే సమీప ప్రాంతాలకు సురక్షితంగా తరలించింది. ప్రభుత్వం భావించినట్లుగానే గ్రీస్‌ దేశస్థులు, టర్కీ సైనికులు ఆ నగర వీధుల్లో ఘర్షణలకు దిగారు. ఆ తర్వాత సైప్రస్‌ను గ్రీస్‌ సైప్రస్‌.. టర్కిష్‌ సైప్రస్‌గా విభజించారు. 

అప్పటి నుంచి వరోషా ప్రాంతం టర్కీ సైన్యం అధీనంలోకి వెళ్లింది. దాడికి ముందు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వరోషా ప్రాంత ప్రజలు తిరిగి అక్కడ నివసించడానికి వీల్లేకుండాపోయింది. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో 1974 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతం అలాగే నిర్మానుషంగా ఉంటోంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో కనిపించరు. భవనాలు, రోడ్లు ఖాళీగా దర్శనమిస్తాయి. ప్రాంతం చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి టర్కీ పోలీసులు, సైనికులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడి బీచ్‌లో పర్యటకులకు అనుమతి ఉంటుంది. కానీ, ఎవ్వరూ కంచెలు దాటి వరోషా ప్రాంతం లోపలికి అడుగుపెట్టే వీలు లేదు. దీన్ని అక్కడి ప్రజలు ‘గోస్ట్‌ టౌన్‌’ అని పిలుస్తుంటారు. అయితే, ఈ ప్రాంతాన్ని తెరిచి.. ప్రజలు నివసించడానికి వీలు కల్పించేందుకు ఈ మధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని