కరోనా కంటే అమెరికా ప్రభావమే ఎక్కువ..!
కరోనా కంటే అమెరికా ప్రభావమే ఎక్కువ..!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు అగ్రరాజ్యం అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుందనే భావన ఉండేది. అయితే, ప్రస్తుతం అమెరికానే సంక్షోభం ఎదుర్కొంటోన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదురైతే ముందుండి నడిపించడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని యురేసియా గ్రూప్‌ పరిశోధన సంస్థ తాజా నివేదిక పేర్కొంది.

ట్రంప్‌ అధ్యక్ష పాలనలో అమెరికా ప్రభుత్వ విధానంలో భిన్న మార్పులు చోటుచేసుకున్నాయని.. అదే సమయంలో కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవం అమెరికాను మరింత సంక్షోభంలోకి నెట్టివేసిందని యురేసియా నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నూతన విశ్వాసాన్ని పొందేందుకు బైడెన్‌కు కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని తాజా నివేదిక అభిప్రాయపడింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ కరోనా చూపించిన ప్రభావం ముగిసిపోదని, దీంతో అధికారంలో ఉన్న నాయకులపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే అమెరికా రాజకీయాల్లో కనిపించిన చీలికల ప్రభావం ప్రపంచదేశాలపై ఉండే అవకాశం ఉందని యురేసియా నివేదిక తెలిపింది.

వీటితోపాటు వాతావరణ, రాజకీయాలు, వివిధ దేశాల స్థానిక సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అడ్డుపడతాయని యురేసియా గ్రూప్‌ అంచనా వేసింది. ఈ కరోనా ప్రభావం, కే-రూపంలో కోలుకుంటున్న ఆర్థికవ్యవస్థలు అటు అభివృద్ధి చెందిన, చెందుతోన్న ఆర్థిక వ్యవస్థలకు అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని యురేసియా అధ్యక్షుడు ఇయాన్‌ బ్రెమర్‌, ఛైర్మన్‌ క్లిఫ్‌ కుప్‌చన్‌ అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..
ఓట్లు కావాలంటూ ట్రంపరితనం
ట్రంప్‌: పోతూ..పోతూ..నిషేధం విధిస్తూ..!

Advertisement

Advertisement


మరిన్ని