రైతులకు అమెరికా నేతల మద్దతు!
రైతులకు అమెరికా నేతల మద్దతు!

అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌

వాషింగ్టన్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన పలువురు శాసనకర్తలు దిల్లీలో అన్నదాతల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. వారంతా శాంతియుతంగా నిరసన కొనసాగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. అయితే, దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. 

‘‘ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పంజాబ్‌ రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నాను’’ అని కాంగ్రెస్‌ సభ్యుడు డగ్‌ లామాల్ఫా అన్నారు. కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్‌ ప్రజాప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌ రైతులు ఎలాంటి భయాందోళన లేకుండా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతించాలి’’ అని పేర్కొన్నారు. డెమొక్రాటిక్‌ కాంగ్రెస్ ‌సభ్యుడు జోష్‌ ఆర్డర్‌ స్పందిస్తూ..‘‘భారత్‌ ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. శాంతియుత నిరసన ఆ దేశ ప్రజల హక్కు. రైతులతో మోదీ సహా ప్రభుత్వ ప్రతినిధులు ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుతున్నాను’’ అని వ్యాఖ్యానించారు. పలువురు నాయకులతో పాటు అమెరికాలో పలు మీడియా సంస్థలు రైతుల ఆందోళనలపై కథనాలు ప్రచురించాయి. 

ఒక ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాలపై విదేశీ నేతల జోక్యం అవసరం లేదని భారత్‌ స్పష్టం చేసింది. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై పలు ఇతర దేశాల నాయకులు చేసిన వ్యాఖ్యల్ని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు సమాచారంతో, దురుద్దేశపూర్వకంగా చేయిస్తున్న వ్యాఖ్యలని పేర్కొంది.

ఇవీ చదవండి..
భారత్‌ బంద్‌: రోడెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు

మోదీజీ మీ పెద్దమనసు చాటుకోండి: బాదల్‌

Advertisement


మరిన్ని