వైట్‌హౌజ్‌ సిబ్బందికి ముందే టీకా!
వైట్‌హౌజ్‌ సిబ్బందికి ముందే టీకా!

వాషింగ్టన్‌: మరికొన్ని గంటల్లో అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలుత, వైద్యారోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించనున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజలకంటే ముందే శ్వేతసౌధంలోని ఉన్నతాధికారులకు వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సిబ్బందికి తొలుత టీకా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌తో కలిసి పనిచేస్తున్న అధికారులకూ తొలి విడతలోనే టీకా ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈవారంలోనే వీరంతా వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీకా అందుబాటులోకి వస్తున్న కొద్దీ ఇతర అధికారులకూ వరుస క్రమంలో అందించనున్నట్లు సమాచారం.

అధ్యక్షుడు ట్రంప్‌, ప్రథమ పౌరురాలు మెలనియా సహా శ్వేతసౌధంలోని పలువురు ఉన్నతాధికారులు మహమ్మారి బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. దీంతో వైట్‌ హౌజ్‌లో మరిన్ని కేసులు రాకుండా అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్‌ టీకా తీసుకోనున్నారా.. లేదా.. అనే విషయం మాత్రం వెల్లడించలేదు.

మిషిగన్‌లోని ఫైజర్‌ అతి పెద్ద కర్మాగారం నుంచి ఫెడెక్స్‌ ట్రక్కులు ఆదివారం బయల్దేరాయి. ఇవి 145 టీకా సరఫరా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను సురక్షితంగా అందజేయనున్నాయి. తొలి విడతలో అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేయనున్నారు. వీటిని ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ యూనిట్స్‌లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్‌హోమ్‌ల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇవ్వనున్నారు. తర్వాత మళ్లీ మూడు వారాలకు వీరందరికీ రెండో డోసు సరఫరా చేస్తారు.

ఇవీ చదవండి...

అమెరికా.. ఊపిరి పీల్చుకో

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలే నిర్వహించాలి

Advertisement

Advertisement


మరిన్ని