అట్టహాసంగా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం
అట్టహాసంగా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం

ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వాషింగ్టన్‌‌: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. తానా అధ్యక్షులు జయ్‌ తాళ్లూరి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లోని 100కి పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం’ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. పూర్తిగా వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీలు సి.ఎం. రమేశ్‌, గల్లా జయదేవ్‌, లావు శ్రీకృష్ణదేవరాయులు, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ఏపీ మాజీ ఉప శాసనసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ ఓలేటి పార్వతీశం, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌. మేడపాటి పాల్గొని మాట్లాడారు.

గత 20 రోజులుగా ఆన్‌లైన్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహించగా.. 40కి పైగా దేశాల నుంచి 18వేల మందికిపైగా అభ్యర్థులు 33 రకాల వివిధ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జులై 24, 25, 26 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో 500 మందికి పైగా సమన్వయకర్తలు 600 మందికి పైగా న్యాయనిర్ణేతలు పాల్గొన్నట్టు కన్వీనర్‌ తూనుగుంట్ల శిరీష తెలిపారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ సభలో తానా అధ్యక్షుడు జయ్‌ తాల్లూరి స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదనానికి నిదర్శనమైన పంచెకట్టులో ఉపరాష్ట్రపతిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. 

డిజిటల్‌ వేదికపై జరిగిన ఈ ప్రారంభోత్సవంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తెలుగు భాషా సంస్కృతులను కొనియాడారు. పోటీలు జరుగుతున్న ఎనిమిది ప్రధాన అంశాలు కూడా తెలుగు జీవనవిధానానికి, ఆలోచన సరళికి, సంస్కృతికి అద్దంపట్టేలా ఉన్నాయంటూ పద్యం, సామెత, పరభాషలేని పలుకు, కళాకృతిలో ముగ్గులు, అల్లికలు, కట్టూబొట్టు అన్ని విభాగాల పేర్లను ప్రస్తావిస్తూ అన్నివిభాగాల పేరును ప్రస్తావిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన తానా అధ్యక్షులు జయ తాళ్ళూరిని సమన్వయకర్త తూనుగుంట్ల శిరీషను అభినందించారు. శిరీష తెలుగు ఉచ్చారణ బాగుందని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని మహోత్సవం అనే కంటే తిరునాళ్లు అంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇకముందు కూడా ఏటా ఇలాంటి కార్యక్రమాలను ప్రవాసాంధ్రులంతా కలిసి చేసుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి భాషా మరియు సాంస్కృతిక సమ్మిళితమైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషిచేసిన అందరికీ తూను గుంట శిరీష ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Advertisement

Advertisement


మరిన్ని