‘చిత్రం’ చెప్పే విశేషాలు (24-09-2020)

‘చిత్రం’ చెప్పే విశేషాలు (24-09-2020)

1/9

కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో హంద్రీ నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో వేల ఎకరాల్లో పంట మునిగి ఇసుక మేటలు వేసింది. గోనెగండ్ల మండలం గాజుదిన్నె ప్రాజెక్టు నుంచి కర్నూలు వరకు సుమారు 50 కిలోమీటర్లు నదీపరివాహక ప్రాంతంలో ఇలా ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద కారణంగా 30 వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2/9

చెట్ల పచ్చదనం భూమి మీద ప్రతిబింబిస్తుంది అనుకుంటే మీరు పొరబడినట్లే. గుంటూరు నగరంలోని మానససరోవరం పార్కు ఇది. లాక్‌డౌన్‌ కారణంగా దీనిని మూసివేశారు. పార్కులో భారీ వృక్షాలు అధిక సంఖ్యలో ఉంటాయి. గత వారం కురిసిన వర్షాలకు పార్కులో నీరు చేరింది. ఆ నీటిలో చెట్ల ఆకులు పడి ఇలా పచ్చదనం కమ్మేసింది.

3/9

ఆకులే పువ్వులై ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి కదా! తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలోని రెల్లు గడ్డి పూలు ఇవి. 12 అడుగుల ఎత్తు పెరిగే రెల్లు గడ్డి సెప్టెంబర్‌ నెలలో పూస్తుంది. ఈ పూలు గాలితోపాటే ఎగురుతూ ఇతర ప్రాంతాలకు వెళతాయి. పూలలోని విత్తనాలు తొలకరి జల్లులకు మొలుస్తాయని స్థానిక రైతులు తెలిపారు.

4/9

నడిరోడ్డుపై మెట్లేంటి అనుకుంటున్నారా? హైదరాబాద్‌ ఉప్పల్‌-ఘట్‌కేసర్‌ మార్గంలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వంతెన నిర్మాణంలో భాగంగా వేసిన పిల్లర్లు మెట్ల మాదిరిగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

5/9

యజమానుల నుంచి తప్పిపోయిన గేదెలు, ఆవులు హైదరాబాద్‌ నగరంలో రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ విధంగా రోడ్లపై కనిపించిన పశువులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. తార్నాక ప్రధాన రహదారిపై ఉన్న ఓ గేదెను వాహనం ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా మొరాయించడంతో సిబ్బంది అవస్థ పడ్డారు.

6/9

నగరంలో పెంపుడు జంతువులకు ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. కుక్కలు, పిల్లులు, పక్షులతోపాటు జంతు ప్రేమికులు జాబితాలో బాతులు చేరాయి. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచి వాటిలో బాతులను వదిలేసి అవి చేసే సందడిని చూసి మురిసిపోతున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు ఉప్పల్‌-వరంగల్‌ రహదారిలో బాతులు అమ్ముతున్నారు. ఒక్కొ బాతును రూ.4నుంచి 8వేలు వరకు విక్రయిస్తున్నారు.

7/9

ఇటలీలోని మిలాన్‌లో జరుగుతోన్న ఫ్యాషన్‌ వీక్‌లో జంతువుల వెంట్రుకలతో తయారు చేసిన వస్త్రాల వాడకాన్ని నిరసిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న పెటా(పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) కార్యకర్తలు.

8/9

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అక్రమ వీధి వ్యాపారులపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిని నిరసిస్తూ వ్యాపారులు ధర్నాకు దిగారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఒకచోట పదిమందికి మించి గుంపుగా ఉండకూడదు. దీంతో ధర్నాలో నిరసనకారుల స్థానాల్లో టెడ్డీ బేర్లు ఉంచి కొద్దిమంది వ్యాపారులు ధర్నా చేశారు. టెడ్డీ బేర్లపై ‘అణివేతను ఆపండి’ అని రాశారు.

9/9

హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన బస్సులు ఆరు నెలల అనంతరం డిపోల నుంచి బయటికి రానున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది బస్సులను కడిగారు. వాటికి సామర్థ్య పరీక్షలు నిర్వహించి శానిటైజేషన్‌ చేశారు. నగరంలో 25 శాతం బస్సులను మాత్రమే నడిపేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని