‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/7

కరోనా కారణంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ భక్తులను భగవంతుడి సన్నిధికి దూరం చేసింది. ఇప్పుడిప్పుడే కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనాలు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోఠిలోని పురాతన శివాలయంలో బయటి నుంచే అభిషేకం చేసేందుకు ప్రత్యేకంగా పైపును అమర్చారు. అందులో నుంచే భక్తులు పంచామృతాలను పోసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేష ఆకర్షణగా నిలుస్తోంది.

2/7

కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోవడం లేదు. చిన్నారులకు స్నేహితులతో ఆడుకోవడం సాధ్యపడట్లేదు. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు ముగిసిన వెంటనే కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు చేసే పనుల్లో పాలు పంచుకుంటున్నారు. మాసబ్‌ ట్యాంక్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని పూజ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇస్త్రీ చేయడం నేర్చుకుంటూ కనిపించింది.

3/7

స్ట్రెచర్‌పై పడుకొని దీనంగా చూస్తున్న ఈ యువతి పేరు సరిత. నిజామాబాద్‌కు చెందిన ఈమె మెట్లపై నుంచి జారిపడటంతో వెన్నెముకకు గాయమైంది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకురాగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా నయమైన తరువాత తీసుకొస్తే వైద్యం చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. దీంతో నిస్సహాయులైన కుటుంబీకులు బాధితురాలిని తిరిగి నిజామాబాద్‌ తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం వెళ్లగా.. ఆమె ఒంటరిగా ఉన్న ఈ దృశ్యం ఎమర్జెన్సీ బ్లాక్‌ వద్ద కనిపించింది.

4/7

పాములా పెనవేసుకుని.. మెలికలు తిరుగుతూ ఏపుగా పెరుగుతున్న ఈ మొక్కలు పైకస్‌ జాతికి చెందినవి. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక నర్సరీ రైతులు వీటిని పెంచుతున్నారు. ఎదిగే క్రమంలో నచ్చిన విధంగా వీటిని కత్తిరించుకోవచ్చని పెంపకందారులు చెబుతున్నారు.

5/7

కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దర్శనాలకు అనుమతి ఇవ్వడం, భారీ కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాలను దేవస్థానం వరకూ అనుమతించడం లేదు. దీంతో కొండమార్గం పొడవునా వాహనాలను పార్కింగ్‌ చేశారు.

6/7

గోదావరికి వరదొచ్చి పంట మొత్తం కుళ్లిపోయినా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకకు చెందిన కౌలురైతు మందపల్లి దుర్గాప్రసాద్‌ ఏమాత్రం దిగులు చెందలేదు. వరద ప్రతాపానికి సుమారు అరెకరం పొలం కోతకు గురైనప్పటికీ వెరవలేదు. రెట్టించిన ధైర్యంతో మరోసారి పంట వేశాడు. ప్రస్తుతం ఆ పొలమంతా బంతిపూలతో ఇలా కళకళలాడుతోంది.

7/7

శ్రీకాకుళంలో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కురిసిన భారీవర్షం కారణంగా పెదపాడు రోడ్‌లో నీరు నిలిచింది. దీంతో చేసేదేమీ లేక ఓ మహిళా వ్యాపారి వర్షపు నీటిలోనే కూర్చొని పండ్ల విక్రయాలకు సిద్ధమైంది.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని