‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/7

మెట్రోవంతెన నిర్మాణం కోసం కొబ్బరి చెట్టును ఊతంగా ఉపయోగించారా..! అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటిదేమీ లేదు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 8లోని ఓ ఖాళీ స్థలంలో మెట్రో నిర్మిస్తున్న సమయంలో చిన్నగా ఉన్న కొబ్బరి చెట్టు నేడు ఏపుగా పెరిగి వంతెనను తాకుతోంది. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో మెట్రో ప్రయాణికులు కొబ్బరికాయల్ని ఉచితంగా పొందే సౌలభ్యం కూడా వస్తుందని ఆ చెట్టు ఎదుగుదలను చూసిన వారు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

2/7

నగర వాసులు కరోనా ముప్పును మరచిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నారని చెప్పడానికి నిదర్శనం ఈ చిత్రం. యూసఫ్‌గూడ వెంకటగిరిలోని వారాంతపు సంతలో ఈ విధంగా కొనుగోలుదారుల రద్దీ కనిపించింది.

3/7

శిరస్త్రాణం ఆవశ్యకతపై ట్రాఫిక్‌ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ద్విచక్ర వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ఖైరతాబాద్‌ షాదన్‌ కళాశాల వద్ద ఓ వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోగా.. తాను తీసుకెళ్లాల్సిన స్టూలును తలకు తగిలించుకొని ప్రయాణం చేశాడు. ఏ మాత్రం ఆ వస్తువు ముందుకు అడ్డుపడినా వాహనం అదుపుతప్పడం ఖాయం.

4/7

ప్రయాణికులు తాగి వదిలేసిన గ్లాసులు, సీసాలతో నీళ్లు తెచ్చి చెట్లకు పోస్తున్న ఈ యువతి పేరు హసీన. నెల రోజులుగా ఎంజీబీఎస్‌లోనే ఉంటోంది. తన కుటుంబ సభ్యుల వివరాలు అడిగితే సరిగా చెప్పడం లేదు. మొక్కలకు మాత్రం నీళ్లు పోస్తోంది. ఆమె ప్రవర్తన నచ్చిన ఆర్టీసీ సిబ్బంది ఆహారాన్ని అందించి ఆ అభాగ్యురాలి కడుపు నింపుతున్నారు.

5/7

తీగలపై బట్టలు ఆరేయడం చూసే ఉంటారు. మరి కరెంటు తీగలపై ఆరేయడం చూశారా? అయితే ఇదిగో చూడండి. అమీర్‌పేటలో ఓ చిరు వ్యాపారి ప్రమాదమని తెలిసి కూడా తెగించి విద్యుత్‌ ప్రసరించే తీగలకు దుస్తులను తగిలించాడు. ఫీజులుండే బోర్డు తలుపుపై అపాయం అని రాసి ఉన్నా లెక్క చేయకుండా దాన్ని సైతం తన వ్యాపారానికి వినియోగించుకోవడం అతడి నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.

6/7

హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్‌-ఎన్జీఆర్‌ఐలో డైమండ్‌ జూబ్లీ వేడుక నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో అతిథులు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయినప్పటికీ వారు వేదికపై ఉన్నట్లు భ్రమించే త్రీడీ చిత్రాన్ని నిర్వాహకులు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

7/7

ఆటోలకు, క్యాబ్‌లకు ప్రవేశం లేదని ట్రాఫిక్‌ పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట సూచిక ఏర్పాటు చేశారు. అయినా కొందరు ఆటోవాలాలు యథేచ్ఛగా ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతున్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని