‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/21

శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉండటంతో తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

2/21

శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉండటంతో హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని వివిధ దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. మోండా మార్కెట్‌ డివిజన్‌ శివాజీనగర్‌లోని పెరుమాళ్‌ దేవస్థానం, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న పాండురంగ దేవాలయాలను విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు.

3/21

హైదరాబాద్ అబిడ్స్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ చర్చి నిర్మించి డిసెంబర్‌ 25తో 200ఏళ్లు పూర్తవుతోంది. దీంతో పాటు క్రిస్మస్‌ వేడుకలు సైతం ఉండటంతో చర్చిని అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాల కాంతులు, ఆకట్టుకునే అలంకరణలతో పలువురు సెల్ఫీలు తీసుకుంటున్నారు.

4/21

పుష్కరాల సమయంలో మురుగునీటి వ్యర్థాలు తుంగభద్ర నదిలో కలవకుండా ఏర్పాటు చేసిన పైపులను తొలగించారు. కర్నూలు నగరంలోని రాంబొట్ల దేవాలయం ప్రాంతంలో పైపులను తొలగించి ఒడ్డున వేశారు. దీంతో మురుగు నేరుగా నదిలో కలిసి నీరంతా కలుషితమవుతోంది.

5/21

అమ్మ ఎంతో మందిని ప్రాధేయపడి తన కడుపు నింపడం చూసింది ఆ చిన్నారి. తల్లి ఒంటరిగా బతిమాలితే ఒక్కపూటే కడుపు నిండుతుందని ఆలోచించిందో ఏమో ఆ పసి హృదయం.. తాను సైతం చేయి చాచి యాచించింది. ఈ దృశ్యం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ వద్ద కనిపించింది.

6/21

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే తిరుమల విచ్చేశారు. పద్మావతీ అతిథి గృహం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

7/21

ప్రేమోన్మాది చేతిలో హతమైన అనంతపురంలోని అశోక్‌నగర్‌కు చెందిన స్నేహలత మృతదేహానికి రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దిశ చట్టం ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.

8/21

ఆదిలాబాద్‌ జిల్లాలోని మన్యంలో నివసిస్తున్న గిరిజనులు చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. గతంలో కంటే ఈ సారి చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో చలిమంటలు వేసుకుని రక్షణ పొందుతున్నారు.

9/21

రోడ్లపై సంజ్ఞలు చేస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసు బస్సుపై ఎక్కి తీగలు లాగుతున్నాడేంటి అని సందేహిస్తున్నారా? ఆయన చేస్తోంది ట్రాఫిక్‌ సిగ్నళ్ల మరమ్మతులు. జూబ్లీ బస్‌స్టేషన్‌ సిగ్నల్ వద్ద మిగిలిపోయిన తీగను కట్‌చేసి తీసుకెళ్లి మరో సిగ్నల్‌ వద్ద అతికించడం కోసమే ఈ సాహసం. ట్రాఫిక్‌ను నియంత్రించడమే మా పని అనుకోకుండా.. అత్యవసరమైతే ఇలాంటి పనులు కూడా చేస్తూ వృత్తిపట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.

10/21

హైదరాబాద్‌ నగర శివారుల్లో ఉదయం వేళ మంచు కురుస్తోంది. ఓ వ్యవసాయ క్షేత్రంలో గడ్డి ఆకులపై మంచు బిందువులు ఇలా వజ్రాల్లా మెరుస్తూ కనివిందు చేస్తున్నాయి.

11/21

జలాశయాలు, నీటి ట్యాంకులు నిండుగా ఉంటే ఆ ప్రాంతమంతా ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. పరిసరాల్లో పశుపక్ష్యాదులకు కడుపునిండా తిండి దొరుకుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు కరకట్ట దెబ్బతినడంతో ఎల్లెల్సీ నుంచి నీటి సరఫరాను ఆపేశారు. దీంతో స్టోరేజీ ట్యాంకు ఎండిపోయి మైదానంలా మారింది. అరుదైన ఎర్ర కొంగలకు ఆహారం కరవయింది. నెర్రలిచ్చిన భూమిలో కొంగల గుంపు ఆహారాన్వేషణ సాగించి విసిగిపోయి దిగాలుగా కనిపించాయి.

12/21

మల్లాపూర్‌ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కరిరాజు ఫౌంటెన్‌ కూడలి వాహనదారులు, చూపరులను ఆకట్టుకుంటోంది. ఫౌంటెన్‌ చుట్టూ గజరాజుల ఆకృతిలో నిర్మాణాలు ఏర్పాటు చేశారు.

13/21

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీని తితిదే ప్రారంభించింది. కరోనా దృష్ట్యా ఈ ఏడాది తిరుపతి ప్రజలకు మాత్రమే సర్వదర్శనానికి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. దీంతో టోకెన్ల కోసం భక్తులు బుధవారం రాత్రి నుంచే క్యూలైన్లలో పడిగాపులు కాశారు.

14/21

నల్లతోక ఉల్లంకి (బ్లాక్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్‌) పిట్టలు కొల్లేరులో సందడి చేస్తున్నాయి. ఏటా అక్టోబరు నుంచి వేసవి వరకు ఇవి సరస్సులో కనిపిస్తాయి. సైబీరియా, మధ్య ఆసియా ప్రాంతాల్లో సరస్సులు, నదులు గడ్డకట్టిన సమయంలో ఆహారం, సంతానోత్పత్తి కోసం దక్షిణ ధృవం వైపు ప్రయాణిస్తాయి. చిన్నగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆహారం కోసం గుంపులుగా వస్తుంటాయి. ఎండలు పెరిగే సమయానికి పిల్లలకు ఎగరడం నేర్పి తమ ప్రాంతానికి తీసుకెళతాయి.

15/21

తెల్లని జులపాలతో ఉన్న దీన్ని చూసి బొచ్చుకుక్క అనుకుంటే పొరపడినట్లే.. ఇది నేపాల్‌ మేక. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలోని కేశనపల్లికి చెందిన అడబాల లక్ష్మీనారాయణ (నాని) దీన్ని పెంచుతున్నారు.

16/21

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కిరణ్‌ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శిస్తున్నారని ఆరోపిస్తూ పెద్దారెడ్డి, అతని అనుచరులు వాహనాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వచ్చి దాడికి దిగారు. జేసీ వర్గీయులు కూడా ఎదురు దాడి చేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

17/21

పై మొదటి ఫొటోలో కనిపిస్తున్న మహిళ దక్షిణ సూడాన్‌కు చెందిన ఎలిజబెత్‌ గిరోస్ద్‌‌. పోషకాహార లోపంతో బాధపడుతున్న తన ఎనిమిది నెలల కవలలకు పాలు పడుతోంది. దక్షిణ సూడాన్‌లో కరవు విజృంభిస్తుండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన ఫొటోల్లో ఆకలి బాధతో మృతి చెందిన తమ పిల్లల గురించి బాధపడుతున్న తల్లుల్ని చూడొచ్చు.

18/21

గ్యాస్‌కట్టర్‌ల సహాయంతో ఏటీఎంలను దోచుకెళ్లే ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన చోరీ సహా 11 ఏటీఎంల చోరీ కేసుల్లో వీరి ప్రమేయమున్నట్లు తేలింది. హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఈ నిందితుల్లో ఆరుగురు పట్టుబడగా, ఇంకా నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

19/21

వకీల్‌సాబ్‌ షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్‌ విరామ సమయంలో ఆదివాసీలతో ముచ్చటించారు. అడవి తల్లితో ముడిపడిన వారి స్థితిగతులను వివరిస్తూ గిరిజనులు పాడిన పాటను పవన్‌ కల్యాణ్‌ ఆస్వాదించారు.

20/21

కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన నాగేశ్వరమ్మ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మంగళవారం చేపట్టిన తిరుమల మహా పాదయాత్రలో పాల్గొని మార్గం మధ్యలో సొమ్మసిల్లిపడిపోయింది. బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న అర్షద్‌ అనే కానిస్టేబుల్‌ వెంటనే ఆమెను తన భుజాలపై మోస్తూ సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో కడప ఎస్పీ అన్బురాజన్‌ సహా పలువురు ప్రముఖుల నుంచి అర్షద్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

21/21

రైతులకు ఆమోదయోగ్యంగా లేని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సేకరించిన రెండు కోట్ల సంతకాల ప్రతులను రాష్ట్రపతికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, గులాంనబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌధురీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని