‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/16

తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామీణ మండలం ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నప్పటికీ సౌకర్యాల లేమి వేధిస్తోంది. స్వాములు ఇరుముడి సమర్పించిన తరువాత వస్ర్తాలను రహదారి పక్కన, కాలువ సమీపంలో విడిచిపెడుతున్నారు. దీంతో దుర్గంధం వ్యాపిస్తోంది.

2/16

హైదరాబాద్‌ మహానగరంలో ఓ వైపు వీఐపీల పర్యటనలు, మరో వైపు రాజకీయ నాయకుల ధర్నాలతో సామాన్య ప్రజలు తరచూ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే సమయంలోనూ ఇలా ఆపడం ఏంటని ఓ వాహనదారుడు ట్రాఫిక్‌ పోలీసును నిలదీశాడు. ట్యాంక్‌బండ్‌-లిబర్టీమార్గంలో కనిపించిందీ దృశ్యం.

3/16

బత్తాయిలా కనిపిస్తున్న ఈ ఫలం పేరు పంపర పనస. పశ్చిమబెంగాల్‌లోని పర్వత ప్రాంతాల్లో విరివిగా పండుతాయి. ద్రాక్ష రుచిని పోలి ఉండే ఈ ఫలంలో కొంచె తీపి కూడా ఉంటుంది. సిట్రస్‌ జాతికి చెందిన వీటిలో విటమిన్‌ సి, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌లు పుష్కలంగా ఉంటాయి. వారాసిగూడకు చెందిన శ్యాంరాజ్‌ వీటిని కోల్‌కతా నుంచి తీసుకొచ్చి బంజారాహిల్స్‌లో అమ్ముతున్నారు.

4/16

దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్‌ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి నాయకులు నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌ కుమార్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

5/16

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కృష్ణా జిల్లాలోని నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నిమ్మకూరు వద్ద రైతులతో మాట్లాడి రంగు మారిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇటీవల మరణించిన పాగోలుకు చెందిన రైతు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు తనయుడిని తానే చదివిస్తానని హామీ ఇచ్చారు. లోకేశ్‌ వెంట మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

6/16

సూర్యాస్తమయాన లాస్‌ ఏంజిలెస్‌ వెనిస్‌ బీచ్‌ తీరంలో పడవలు తిరుగాడుతున్న ప్రకృతి రమణీయ దృశ్యం

7/16

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో మంచుతో కప్సేసిన ఓ బేరీ చెట్టుపై కూర్చొని చల్లని పండ్లను ఆరగిస్తున్న నల్ల బుల్‌బుల్ పిట్ట(పికిలిపిట్ట)

8/16

కృష్ణా జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కంకిపాడు మీదుగా గుడివాడ చేరుకున్న ఆయన అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

9/16

కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఇవాళ ఉదయం కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల ప్రారంభమైన డ్రైరన్‌ ముగిసింది. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కన్పించలేదని సంయుక్త కలెక్టర్‌ శివశంకర్‌ వివరించారు. కంకిపాడు మండలం ఉప్పులూరులో డ్రైరన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు.డ్రైరన్‌ అనుభవాలను బట్టి వ్యాక్సినేషన్‌ మరింత మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

10/16

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం కాంగ్రెస్‌ శ్రేణులు ‘రైతు కవాతు’ చేపట్టాయి. ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్ నుంచి ధర్నా చౌక్‌ వరకూ ఈ ర్యాలీ సాగింది. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని భట్టి అన్నారు.

11/16

సినీనటి, బిగ్‌బాస్‌ ఫేం నందినీరాయ్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

12/16

ఏపీ పర్యటనకు విచ్చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో ఈ ఉదయం వాహ్యాళి చేశారు.

13/16

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకలు నిర్వహించారు.చరణ్‌రెడ్డి, ప్రత్యూష వివాహానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

14/16

కోతులను చూడగానే కుక్కలు అరుస్తూ వెంటాడుతాయి. దీనికి భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులోని ఓ కుక్క, కోతి వైరం మరిచి తిరుగుతున్నాయి. కోతి పుట్టిన కొన్ని రోజులకు దాని తల్లి చనిపోయింది. గాయాలతో ఉన్న బుల్లి వానరాన్ని స్థానికంగా కోళ్ల ఫారం నిర్వహిస్తున్న శిరిగిన పాపారావు, వెంకటచౌదరి చేరదీసి చికిత్స చేయించారు. వారు పెంచుకుంటున్న ఓ శునకం దీన్ని అక్కున చేర్చుకుని తనతోపాటే తిప్పుతోంది. మిగిలిన కోతులను చూసి కూడా ఈ వానరం కుక్క వద్దే ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. -న్యూస్‌టుడే, రంగంపేట

15/16

చిత్రం చూసి ఇదేదో నదిలో చేపల వేట సాగిస్తున్నారనుకుంటే పొరబడినట్లే. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామ రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ గ్రామ రైతులకు చెందిన 300 ఎకరాల భూములు చెరువుకు అవతలి వైపు ఉన్నాయి. అక్కడికి రోడ్డు మార్గంగా వెళ్లాలంటే దాదాపు 7 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కారణంగా రైతులు, కూలీలు, గీత కార్మికులు తమ పనులు చేసుకోవడానికి నిత్యం తెప్పలపైనే ప్రయాణించి చెరువు అవతలివైపునకు వెళ్తుంటారు. వ్యవసాయ సామగ్రి, ఎరువులను సైతం పడవలపైనే తీసుకెళ్తారు. -న్యూస్‌టుడే, గొల్లపల్లి (జగిత్యాల)

16/16

పార పట్టి వరి చేలో దమ్ము చేస్తున్న ఈ రైతు పేరు వాంకుడోతు బోడియా.. వయసు దాదాపు 90 ఏళ్లు. ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం వాచ్యతండా. వృద్ధాప్యంలోనూ మట్టి వాసన మానలేక తన రెక్కల కష్టంతో ముక్కారు పంటలు పండిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. తనకున్న ఐదెకరాల్లో ఇద్దరు కుమారులకు చెరో రెండు ఎకరాలు ఇచ్చారు. మిగిలిన ఎకరంలో సొంతంగా వ్యవసాయం చేస్తూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఎక్కువ సమయం పనిచేసుకుంటూ పొలం బావి దగ్గరే ఉంటారని సమీప రైతులు తెలిపారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసే అలవాటు, జొన్న రొట్టెల ఆహారం కారణంగానే ఇప్పటికీ పనిచేసుకోగలుగుతున్నానని బోడియా చెప్పారు. - న్యూస్‌టుడే, సంస్థాన్‌ నారాయణపురం

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని