‘చిత్రం’ చెప్పే విశేషాలు

‘చిత్రం’ చెప్పే విశేషాలు

1/11

ఇటీవలే యూట్యూబర్ ధనశ్రీని పెళ్లాడి ఓ ఇంటివాడైన క్రికెటర్‌ యుజువేంద్ర చాహల్ టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని కలిశాడు. ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడం సంతోషంగా ఉందని చెబుతూ చాహల్‌ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటోను షేర్‌ చేశాడు. ఆ చిత్రాన్ని ధోనీ సతీమణి సాక్షి క్లిక్‌మనిపించినట్లు వెనుక అద్దాల్లో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తే అర్థమవుతోంది.

2/11

గడువు తీరకుండానే నేపాల్‌ పార్లమెంటును రద్దు చేయడాన్ని నిరసిస్తూ అధికార కమ్యూనిస్టు పార్టీ చీలిక వర్గం కాఠ్‌మాండూలో భారీ ప్రదర్శన చేపట్టింది. ప్రధానమంత్రి ఓలిని పదవి నుంచి బర్తరఫ్‌ చేసి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పార్టీ ముఖ్యనేతలు నారాయణ్‌ కాజి శ్రేష్ఠ, పుష్పకమల్‌దహల్‌, మాధవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

3/11

నివర్‌ తుపానుతో తీవ్ర పంటనష్టం వాటిల్లి ఓ వైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే.. మరో వైపు ప్రభుత్వం అందజేసిన పరిహారంతో రైతులకు ముందే సంక్రాంతి వచ్చిందని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విమర్శించారు. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ రైతులు లోకేశ్‌కు తమ సమస్యలు విన్నవించారు.

4/11

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు దీక్ష కొనసాగిస్తున్నారు. ‘మేము రైతులం.. తీవ్రవాదులం కాదు’ అంటూ కొందరు యువ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు.

5/11

ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్సీలు రామచంద్రరావు, నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

6/11

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం రోహింగ్యా శరణార్థుల కోసం బే ఆఫ్‌ బెంగాల్‌ చిత్తగాంగ్‌లోని ఓ దీవిలో ప్రత్యేక స్థావరాలు నిర్మించింది. ఇప్పటికే కొందరు శరణార్థులను తీసుకెళ్లి ఆ దీవిలో విడిచిపెట్టిన ప్రభుత్వం సోమవారం మరో శరణార్థుల బృందాన్ని తరలించింది. రోహింగ్యాల సమ్మతితోనే అక్కడకు తీసుకెళుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. బలవంతంగా వారిని దీవిలో వదిలిపెడుతున్నారనేది మానవ హక్కుల కార్యకర్తల వాదన.

7/11

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో సోమవారం మంచు కప్పి మొరాయించిన వాహనం.. ధర్మశాలలో పండు అందుకొంటున్న పికిలి పిట్ట

8/11

విజయవాడకు సమీపంలోని సీతానగరం కొండపైనున్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర, వరాహ స్వాముల ఆలయాలను దర్శించుకొని గంటపాటు చిన్నజీయర్‌ స్వామితో గడిపి ఆయన ఆశీస్సులు పొందారు.

9/11

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో కొందరు అంధులు నిరాశ చెందకుండా సంగీతాన్ని నేర్చుకుని కళా ప్రదర్శనలు ఇస్తూ దాన్నే ఉపాధిగా మార్చుకున్నారు. కరోనా నేపథ్యంలో కార్యక్రమాలు కొనసాగకపోవడం వారి ఉపాధిపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో పాదబాటలనే కళాక్షేత్రాలుగా మార్చుకుని కచేరీలు నిర్వహిస్తూ ఆదాయం పొందుతున్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపో సమీపంలో రాత్రి వేళ పాదచారుల బాటలో ఇలా కచేరి నిర్వహిస్తూ కనిపించారు.

10/11

ఓ రౌడీషీటర్‌ బారి నుంచి తమను రక్షించారంటూ సోమవారం బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కళింగరావు, సెక్టార్‌ ఎస్‌ఐ రాంబాబులను హిజ్రాలు సత్కరించారు. రౌడీషీటర్‌ కుర్మ వెంకటేష్‌ యాదవ్‌ అలియాస్‌ చిన్నాపై 8 ఠాణాల్లో కేసులుండగా బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టుచేశారు. ఓ హత్య కేసులో కోర్టు ఈనెల 19న వెంకటేష్‌కు జీవిత ఖైదు విధించింది. దీంతో వీరు ఆనందంతో నృత్యాలు చేశారు. -న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

11/11

మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో సోమవారం రూపదర్శినులు సందడిచేశారు. ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో మిస్‌ఇండియా-తెలంగాణ(2018) కామాక్షితో పాటు పలువురు ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనర్‌ దుస్తులు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. - న్యూస్‌టుడే, మాదాపూర్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని