చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పే విశేషాలు

1/15

మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తన జన్మదినం పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. టీవీ యాంకర్‌ సుమ కనకాల, బిగ్‌బాస్‌ ఫేమ్ లాస్య మంజునాథ్‌లను ఆమె గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.

2/15

నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వచ్చే ఆదిలాబాద్‌ జిల్లా పోలీసు, కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట బూజు పట్టిన సీసీ కెమెరాలు దర్శనమిస్తున్నాయి. ఇటుగా వెళ్లేవారు వాటిని చూసి ఇక్కడే ఇలా ఉంటే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాల పరిస్థితి ఎలా ఉంటుందో అని అధికారుల తీరును విమర్శిస్తున్నారు.

3/15

ఆవులకు చెవులు తలకు తగ్గట్లు సాధారణ పరిమాణంలో ఉంటాయి. ఆదిలాబాద్‌ పట్టణంలో తిరుగుతున్న ఈ ఆవుకు మాత్రం ముఖంతో సమానంగా కనిపిస్తున్నాయి. వీటిని కాలీఫ్లవర్‌‌ చెవులుగా పిలుస్తారు. గిర్‌ జాతికి చెందిన ఈ ఆవులు మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి.

4/15

వారణాసిలోని గంగానది వెంట సైబీరియన్‌ వలస పక్షులు కనువిందు చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు వాటికి మేత వేయడంతో పాటు ఫొటోలు దిగుతూ ఆనందపడుతున్నారు. ఈ పక్షులు అక్టోబర్‌ నుంచి మార్చి వరకు మన దేశంలో కనిపిస్తాయి.

5/15

పియాజియో కంపెనీ తయారు చేసిన అఫ్రీలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌-160 మోడల్‌ స్కూటర్‌‌ను కంపెనీ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి కానుకగా అందజేశారు. ఆలయం ఎదుట డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు అప్పగించారు. బుధవారం నుంచి డెలివరీ ప్రారంభిస్తున్న సందర్భంగా స్వామివారికి తొలి స్కూటర్‌ను కానుకగా ఇచ్చినట్లు తెలిపారు.

6/15

నటుడు రానా దగ్గుబాటి కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రానా అడవిని రక్షించే ఓ ఆదివాసిగా కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ‘కాడన్‌’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ఈ సినిమా విడుదల కానుంది. ప్రభు సాలమన్‌ దర్శకత్వం వహించారు.

7/15

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఐదు రోజులపాటు నిర్వహించే భవానీ దీక్షల విరమణ కార్యక్రమం బుధవారం రెండో రోజు కొనసాగుతోంది. దీక్షాధారులు అమ్మవారిని దర్శించుకొని మల్లికార్జున మహామండపంలో ఇరుముడులు సమర్పించారు.

8/15

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువరు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

9/15

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పంజాబ్‌ రాష్ట్ర రైతులు ట్రాక్టర్లతో దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో తయారైన ట్రాక్టర్‌ బొమ్మలను ఒంగోలు నగరంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వెంబడి అమ్ముతున్నారు. ఈ ట్రాక్టర్‌ ఎంత గట్టిదో తెలిపేందుకు అమ్మకపుదారుడు వాటిపై నిల్చొని చూపిస్తున్నాడు. ‘మా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఎంత దృఢంగా పోరాడుతున్నారో.. ఇవీ అంతే దృఢంగా ఉంటాయి’ అంటూ వివరిస్తున్నాడు.

10/15

మారుతున్న కాలానికి అనుణంగా దొంగలు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుపడకుండా జాగ్రత్త పడుతూ.. నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు. జైపూర్‌ మండలం ఇందారంలోని టేకుమట్ల ఎక్స్‌రోడ్డు సమీపంలో రెండు రోజులుగా ఓ లారీ నిలిపి ఉంటోంది. సంబంధిత వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో దుండగులు దొంగిలించి ఇక్కడ నిలిపివేసి ఉంటారని వాహన చోదకులు అభిప్రాయపడుతున్నారు. లారీ తీసుకువచ్చిన దొంగలు కేవలం దాని చక్రాల(టైర్లు)ను మాత్రమే ఎత్తుకెళ్లి వాహనాన్ని అలాగే వదిలిపెట్టారు. దాని ఆనవాళ్లు తెలియకుండా నంబర్‌ప్లేట్‌ను సైతం మార్చినట్లు తెలుస్తోంది.

11/15

యంత్రాల వినియోగంతో కూలీల కొరతను అధిగమించడంతోపాటు పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ పనులకు యంత్రాలను ఆశ్రయించే ఒరవడి పెరుగుతోంది. చౌటకూరు మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన రైతు సదానందరెడ్డి యాసంగి సాగుకు డ్రం సీీడర్‌ ద్వారా వరి నారు పోయిస్తున్నారు. ఆయన పొలాన్ని మంగళవారం అందోలు డివిజన్‌ వ్యవసాయ అధికారి అరుణ పరిశీలించారు. సంప్రదాయ పద్ధతిలో కూలీలతో ఈ పని చేయిస్తే ఎకరాకు 25కిలోల విత్తనాలు అవసరమని, ఈ యంత్రంతో 8 కిలోలు చాలని ఆమె తెలిపారు. వ్యయం కూడా రూ.5 వేల వరకు ఆదా అవుతుందన్నారు. సహజంగా నాలుగు నెలలకు వచ్చే పంట 15 రోజుల ముందుగానే వస్తుందన్నారు. దిగుబడి సైతం 6- 7 బస్తాలు అధికంగా పండుతాయని ఆమె వివరించారు. డ్రం సీడర్‌ను సదానందరెడ్డి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రూ.5 వేలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు.

12/15

చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ అంటే ఆయనకెంతో ఇష్టం. ఉద్యోగం వచ్చాక ఆ పని చేయాలనుకున్నారు. పరిస్థితులు అనుకూలించలేదు. చివరకు ఉద్యోగ విరమణ తర్వాత తన కలను సాకారం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా (సింగరేణి)లో అటెండరుగా పనిచేసిన కంచె రామారావు గతేడాది అక్టోబరులో రిటైర్‌ అయ్యారు. పట్టణానికి సమీపంలో గుట్టమల్లారంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రాజస్థాన్‌ వెళ్లి రూ. 2.4 లక్షలతో ఓ అశ్వాన్ని కొనుగోలు చేశారు. శ్రద్ధగా సాధన చేసి స్వారీ నేర్చుకున్నారు. ఇప్పుడు పొలానికి, సమీప ప్రాంతాలకు దీనిపైనే వెళ్తున్నారు. అశ్వం దాణా కోసం నెలకు రూ.7,000 ఖర్చవుతోందని రామారావు తెలిపారు.

13/15

ఆరడుగుల ఎత్తులో.. బోనగిరి కొండలాంటి మూపురంతో అలరిస్తున్న ఈ వృషభరాజాల ఖరీదు ఎంతో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 40 లక్షల పైమాటేనట! గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన రైతు పుంగం సందీపురెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో బండలాగుడు పోటీల కోసం వీటిని తీసుకువచ్చారు. ఇలాంటి పోటీలు ఎక్కడ జరిగినా ఒంగోలు జాతికి చెందిన ఈ కోడెలను తీసుకుని తప్పకుండా హాజరవుతానని, సీనియర్‌ విభాగంలో తన కోడెలే మొదటి బహుమతి గెలుచుకుంటాయని గర్వంగా చెప్పారు. ఇవి ఇప్పటి వరకు పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయని వివరించారు. రోజూ వీటికి ఆహారంగా 6 కేజీల ఉలవపిండి, 2 కేజీల రాగిజావ, ఖర్జూరం, గడ్డి, చొప్ప పెడతారు. వీటి పోషణకు రోజుకు రూ. 2,000 వరకు ఖర్చవుతుందని, వీటిని బాగోగులు చూసుకోడానికి ఇద్దరు కూలీలు అవసరమని తెలిపారు.

14/15

ఈశాన్య చైనాలోని హర్బిన్‌ నగరంలో వార్షిక హర్బిన్‌ ఐస్‌ అండ్‌ స్నో ఉత్సవంలో మంచు దిమ్మెలతో తీర్చి దిద్దిన కళాఖండాలు ఇవి. ఉత్సవానికి వచ్చిన పర్యాటకులు వాటిపై కూర్చుని మురిసిపోయారు.

15/15

రెండు కాళ్లను కోల్పోయిన వీధి శునకంపై ఓ గ్రామీణ వైద్యుడు చూపిన కరుణతో ఆ కుక్క సులువుగా నడవగలుగుతోంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు షేక్‌ ఆషా కొద్ది రోజుల క్రితం తన నివాసానికి దగ్గర్లో ఓ వీధి శునకానికి నడుము, కాళ్లు విరిగిపోయి ఉండటాన్ని గమనించారు. దాన్ని చేరదీసి ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకునే చక్రాల బండికి మార్పులు చేర్పులు చేసి శునకం నడుముకు ఇలా అమర్చారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని