చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పే విశేషాలు

1/32

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్‌ 14 నుంచి 25రోజుల పాటు సాగిన అధ్యయనోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

2/32

సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ మనవరాలు జోహ్ర ఫాతిమా వివాహం ఫయాజ్‌ ఖలీద్‌ షరీఫ్‌తో జరిగింది. ఈ వివాహానికి ఎమ్మెల్సీ కవిత, గవర్నర్‌ తమిళిసై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

3/32

కర్నూలు నగర శివారులోని రింగ్‌రోడ్డు వద్ద ఓ నెమలి సిమెంటు దిమ్మపై నిల్చొని కనువిందు చేసింది. దాని వెనుకే చిన్న వృక్షం ఉండటంతో నెమలి పురివిప్పినట్లుగా కనిపించి ఆకట్టుకుంది.

4/32

15 అంగులాలకు పైగా ఉన్నఈ క్యారెట్‌ దుంపలు రాజమహేంద్రవరం మార్కెట్‌లో లభిస్తున్నాయి. బెంగళూరు నుంచి దిగుమతైన వీటిని హల్వా, జ్యూస్‌ చేసేందుకు వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు.

5/32

ఆదిలాబాద్‌లోని కలెక్టర్‌ చౌరస్తాలో ట్రాక్టర్‌పై పెద్దఎత్తున ఇనుప ఊచలను ఉంచి రద్దీ రహదారిపై తరలిస్తున్నారు. వెనుక వచ్చే వాహనదారులు ఏ మాత్రం చూసుకోకపోయినా, పక్క నుంచి వాహనాలు వచ్చినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

6/32

చిన్నారిని ద్విచక్రవాహనం వెనుక ప్రమాదకరంగా కూర్చొబెట్టి తీసుకెళ్తున్న చిత్రం ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో కనిపించింది.

7/32

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఇందులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నీల వెంకటేశ్‌, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురుకుల పీఈటీ ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

8/32

ఛాతిలో అసౌకర్యంగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అనంతరం తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. వైద్య పరీక్షల ఫలితాలు రేపు వెల్లడిస్తామన్నారు.

9/32

నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్న రైతన్నలు.. హలంతో పొలాలు దున్నే ట్రాక్టర్లను కూడా ఉద్యమబాటలోకి మళ్లించారు. శుక్రవారం రైతుసంఘాల ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు జరపనున్న నేపథ్యంలో దిల్లీ నలుదిక్కులా ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు.

10/32

గుంటూరు జిల్లా బాపట్లలో పేదలకు నివాస స్థలాల పంపిణీ కార్యక్రమానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు అశ్వ రథంపై వెళ్లారు. దీనికి ఉపసభాపతి కోన రఘుపతి రథసారథిగా వ్యవహరించడం విశేషం.

11/32

ఇండోనేసియాలోని మౌంట్ మెరపి బిలం నుంచి అగ్నిపర్వత రేణువులు పైకి ఎగిసిపడుతున్నాయి. 9737అడుగుల ఈ పర్వతం పొగలు కక్కుతున్న దృశ్యాలు యోగ్యకర్తలోని స్లేమన్‌ వద్ద కనిపించాయి.

12/32

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) సమావేశమైంది. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ‘క్యాపిటల్‌ భవనం’లోకి దూసుకొచ్చారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి మరీ ఆందోళనకారులను నిలువరించాల్సి వచ్చింది.

13/32

విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మయాత్ర కోసం అక్కడికి చేరుకొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆపార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. ఎమ్మెల్సీ మాధవ్‌, జనసేన నాయకురాలు యశస్వి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

14/32

తిరుపతిలో నిర్వహిస్తున్న డ్యూటీమీట్‌కు విచ్చేసిన ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీనటుడు సాయికుమార్‌, యువ కథానాయకుడు నితిన్‌, సింగర్‌ రేవంత్, వ్యాఖ్యాత దీప్తి తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

15/32

యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లోని ఇండస్ట్రియల్ పార్క్‌లో ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్‌, ఎంపీ సంతోశ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు.

16/32

ఇనార్బిట్‌మాల్-ఖాజాగూడ చౌరస్తాను కలుపుతూ కొత్తగా ఓ రోడ్డు నిర్మించారు. బయో డైవర్సిటీ పార్క్‌ వెనుక పెద్ద కొండ మధ్యలో నుంచి ఆ రోడ్డు నిర్మాణం సాగింది. అయితే ఆ కొండలోని రాళ్లు, మట్టి స్వభావాన్ని సరిగా అంచనా వేయలేకపోయారు. దీంతో ఇటీవలే కొన్ని కొండ చరియలు విరిగిపడ్డాయి. అంతకుముందే ఈ రోడ్డుపై అనుమానం వచ్చి రాకపోకలు నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది. తాజాగా కొండపై వదులుగా ఉన్న మట్టిని, రాళ్లను తొలగించే పనులు జరుగుతున్నాయి. మరో సంవత్సరం ఆగితేగానీ ఈ రోడ్డు అందుబాటులోకి రాదని గుత్తేదారు ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

17/32

పాడేరు శివారు కొండల్లో ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. బుధవారం వేకువజామున కమ్ముకున్న కారు మబ్బులో, మంచు సోయగాల నడుమ వివిధ రూపాల్లో విచ్చుకున్న సూర్య కిరణాలను ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రకృతి సిద్ధమైన ఈ అందాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. - పాడేరు, న్యూస్‌టుడే

18/32

విశాఖలోని జీకేవీధి మండలం చాపరాతిపాలెం పేరుచెప్పగానే లేటరైట్‌ క్వారీ గుర్తొస్తుంది. ఆ గ్రామంలో ఇప్పుడు కొత్త జలపాతం వెలుగులోకి వచ్చింది. శివాలయం సమీపంలో చాపరాతిపై పరవళ్లు తొక్కుతున్న జలధార ఆకట్టుకుంటోంది. దీన్ని అభివృద్ధి చేస్తే ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుందని పలువురు పేర్కొంటున్నారు. -న్యూస్‌టుడే గూడెంకొత్తవీధి

19/32

విశాఖపట్నంలో పర్యాటక ప్రాంతమైన యారాడ సాగర తీరంలో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు భారీ సొర చేప చిక్కింది. మధ్యాహ్నం సమయంలో సుమారు టన్ను బరువు గల పెద్ద చేప ఏదో తమ వలలకు చిక్కడంతో... సంబరపడిన 25 మంది మత్స్యకారులు దాన్ని తీరానికి లాక్కొచ్చారు. చివరకు సొర చేపగా గుర్తించి... బతికే ఉండడంతో తిరిగి నీటిలోకి పంపే ప్రయత్నం చేశామని, సాయంత్రం వరకు సాగరంలోకి వెళ్లకపోవడంతో ఒడ్డునే వదిలేసి తామంతా ఇంటి ముఖం పట్టామని తాతారావు అనే మత్య్సకారుడు పేర్కొన్నాడు. అయితే అది అలల తాకిడితో తిరిగి లోపలకు వెళ్లిపోతుందని మత్స్యకారులు తెలిపారు. - న్యూస్‌టుడే, సింధియా

20/32

వర్షంతో తిరుమల గిరులు ఆహ్లాదకరంగా మారాయి. రెండురోజులుగా వర్షం పడుతుండటంతో పొగమంచు కమ్ముకొంది పరిసరాలు తెల్లటి మంచుతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి.-న్యూస్‌టుడే, తిరుమల

21/32

రబీ వరి సాగుకు పొలాన్ని సరి చేసుకునేందుకు ఉపయోగించే నొల్ల చెక్కను లాగేందుకు కాడెద్దుల కరవు కావడంతో ఇదిగో ఇలా రైతులే చెక్కను పొలంలో ఇడ్చుకుంటూ ఎత్తుపల్లాలను చదును చేసుకుంటున్నారు. కష్టమైనా కర్షకుడికి తప్పదు మరి. సరుబుజ్జిలి మండలంలోని షళంత్రి గ్రామంలో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కిన చిత్రమే ఇది. - న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, శ్రీకాకుళం.

22/32

ఈ చిత్రాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. గుండె వేగం పెరుగుతుంది. ఎంత పే..ద్ద కొండచిలువోనని అరవాలనిపిస్తుంది. కానీ, ఇది నిజమైన కొండచిలువ కాదండి. రాతిపై చెక్కిన చిత్రం. నెల్లూరు జిల్లా పెంచలకోనలోని అటవీ ఉద్యాన వనంలో రాతిపై దీన్ని మలిచారు. తొలుత పర్యాటకులు దీన్ని చూసి భయపడినా, బొమ్మని తెలిశాక.. స్వీయచిత్రాలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.- న్యూస్‌టుడే, చేజర్ల

23/32

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని దర్శనాల వెంకటేశం ఇంట్లోకి పాము చొరబడి కలకలం సృష్టించింది. నాగుపాము సుమారు మూడు గంటల పాటు పడగ విప్పి దేవుళ్ల చిత్ర పటాలపైనే ఉంది. కిందకి దిగి బయటకు వెళ్లాలంటూ వృద్ధులు వేడుకుంటూ మొక్కులు చెల్లించారు. పామును చూసేందుకు సంఘటనా స్థలంలో గ్రామస్థులు భారీగా గుమిగూడారు. -వీర్నపల్లి, న్యూస్‌టుడే

24/32

కొల్లేరును దాటుకుని లంకగ్రామాల ప్రజలు ఆటపాక, కైకలూరు రావడానికి అవస్థలు పడుతున్నారు. కోమటిలంక నుంచి రోడ్డు మార్గం ద్వారా కైకలూరు చేరుకోవాలంటే సుమారు 8 కి.మీ ప్రయాణించాలి. అదే కొల్లేరును దాటితే చిటికెలో ఆటపాక చేరుకోవచ్చు. దీంతో ప్రమాదమని తెలిసినా ఇలా నాచుపట్టిన రాళ్లను, గుంతలను దాటుతూ పక్క ఊళ్లకు చేరుకుంటున్నారు. చిన్నపాటి పడవపై పరిమితికి మించి రాకపోకలు సాగిస్తున్నారు. - ఈనాడు, విజయవాడ

25/32

సంక్రాంతి సమీపించడంతో నగరంలో గాలిపటాల సందడి నెలకొంది. దుకాణాలు రంగురంగుల పతంగులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ పిల్లలు ఎగరవేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. మిస్‌ ఇండియా ఐకానిక్‌ పర్సనాలిటీ-2019, మిస్‌ తెలంగాణ-2020 కాజల్‌ రత్వానీ బుధవారం బంజారాహిల్స్‌లో పతంగులతో సందడి చేశారు. - న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌

26/32

సన్నజాజి సహజంగా ప్రతి ఇంటిలో ఉండే ఒక పూలజాతి మొక్క.పూలు, గృహాలంకరణ కోసం ఇంటి ముందు పెంచడం, మిద్దిపైకి అల్లించడం కనిపిస్తుంది. విజయవాడ ఆటోనగర్‌ శివారు పంట కాల్వ రోడ్డు సిరినగర్‌లోని ఓ ఇంటి యజమాని వేసిన సన్నజాజి తీగ ఏకంగా మూడంతస్తుల పైకి అల్లుకుని చూపరులను ఆకర్షిస్తోంది. ఈ విషయంపై పటమట ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు బి.దయాకర్‌బాబు మాట్లాడుతూ సహజంగా గాలి, సూర్యరశ్మి, ఖాళీ ప్రదేశం అనువుగా ఉంటే సన్నజాబి 10 అడుగులు పెరుగుతుందని, ఇలా ప్రదేశం తక్కువ ఉంటే సూర్యరశ్మి కోసం పైకి ఎగబాకుతుందని వివరించారు. - న్యూస్‌టుడే, పటమట

27/32

విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో 4వ ఆంధ్రా గర్ల్స్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో బుధవారం భారత సైనిక దళాల యుద్ధ, ఆయుధ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నమూనాలను ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు.

28/32

నగరంపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. సమీప దూరంలోనివీ కన్పించని పరిస్థితి. శంషాబాద్‌ విమానాశ్రయంలోని ఏటీసీ టవర్‌ బుధవారం పట్టపగలు కూడా సరిగా కన్పించలేదంటే పొగమంచు తీవ్రత అర్థం చేసుకోవచ్చు. భారీ పరిమాణంలో ఉండే విమానాలు కూడా లీలగా కన్పించాయిలా..

29/32

అవసరం ఎంతటి వారినైనా వినూత్న ఆలోచనల వైపు నడిపిస్తుందని కర్ణాటకకు చెందిన ఓ రైతు నిరూపించారు. కరవు జిల్లాగా పేరొందిన గదగ జిల్లా సోమపుర గ్రామ నివాసి సిద్ధప్ప హులజోగి.. చిన్న విద్యుదుత్పత్తి యంత్రాన్ని రూపొందించారు. దీన్ని క్రికెటర్‌ వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌ ట్వీట్‌ చేసి.. సిద్ధప్పను అభినందించారు. చిన్న తట్టలను ఉపయోగించి సిద్ధప్ప.. ఓ చక్రాన్ని తయారు చేశారు. దీన్ని కాల్వలో అమర్చి నీటి ప్రవాహంతో చక్రం తిరగడం ద్వారా విద్యుదుత్పత్తి తయారు చేసే వ్యవస్థను కనుగొన్నారు. ఈ విద్యుత్‌ను తోట అవసరాలకు వినియోగిస్తున్నారు.

30/32

ఈ చిత్రాన్ని చూడగానే పులి.. శునకాన్ని పోలి ఉందేం అనుకుంటున్నారు కదూ! ఇది నిజంగా శునకమే. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలోని ఈ శునకానికి అచ్చు పులి మాదిరే చారలు ఉన్నాయి. ఈ గ్రామసింహాన్ని చూసి ‘అమ్మో పులి’ అని బెంబేలెత్తడం కొత్తగా ఆ గ్రామానికి వెళ్లేవారి వంతవుతోంది..!

31/32

ఇది సెర్బియాలోని పాట్‌పెకో సరస్సు. దీనిలోకి భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు కొట్టుకొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సరస్సుపై ఉన్న జలవిద్యుత్‌ కేంద్రం ఆనకట్ట వద్ద భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయి నీటిలో ఇలా తేలియాడుతున్నాయి. బుధవారం డ్రోన్‌ సాయంతో తీసిన చిత్రమిది.

32/32

జమ్మూ కశ్మీర్‌లో భారీగా హిమపాతం కురుస్తోంది. ఇళ్లపై కొన్ని అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. రహదారులన్నీ పూర్తిగా మంచుతో నిండిపోయాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో దాల్‌ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. దీంతో కొందరు పడవల యజమానులు మంచు గడ్డలను బద్దలు కొడుతూ ఇలా ముందుకు సాగుతున్నారు.

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని