ఏపీ అసెంబ్లీ.. రెండో రోజూ వాడీవేడి..!

తాజా వార్తలు

Updated : 01/12/2020 16:54 IST

ఏపీ అసెంబ్లీ.. రెండో రోజూ వాడీవేడి..!

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సమావేశాల్లో భాగంగా పేదల ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల అంశాలపై జరిగిన చర్చలో తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర తెదేపా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు స్థలసేకరణ తదితర అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. అనంతరం టిడ్కో ఇళ్లపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టుకు వెళ్లారని ఆక్షేపిస్తూ పరోక్షంగా తెదేపాపై ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా కోర్టు కేసులు వెనక్కి తీసుకుని సహకరించాలని కోరారు. ఒకవేళ కేసులు వెనక్కి తీసుకోకపోయినా సంకల్పం బలంగా ఉంది కనుక ఒకట్రెండు రోజుల ఆలస్యంగానైనా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. చర్చలో భాగంగా మంత్రులు మాట్లాడిన అనంతరం వైకాపా సభ్యుడు వసంత కృష్ణప్రసాద్‌కు స్పీకర్ అవకాశమిచ్చారు. 

ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెదేపా సభ్యులు తమ స్థానాల్లో లేచి అవకాశమివ్వాలని కోరారు. ఎందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో తెదేపా సభ్యులు ఆయనకు మద్దతుగా అవకాశమివ్వాలంటూ నినాదాలు చేశారు. తెదేపా సభ్యుల వైఖరిపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అద్దంలాంటిదని.. ప్రజలు గమనిస్తున్నారన్నారు. శాసనసభలో నిలబడితే అద్దం ముందు నిలబడినట్లేనని.. జాగ్రత్తగా వ్యవహరించాలని తెదేపాకు సూచించారు. ఇంతకుముందు అవకాశాలు ఇవ్వలేదా? ఇప్పుడూ ఇస్తాం.. కాసేపు ఆగాలని చెప్పారు.  మరోవైపు స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కరణం ధర్మశ్రీ తదితరులు మాట్లాడుతూ స్పీకర్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని